యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మనకు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు కేరళను వరదలు వణికిస్తున్నాయి. కేరళలోనైతే ప్రస్తుతం పరిస్థితులు గతేడాది వచ్చిన భారీ వరదలను గుర్తుకు తెస్తున్నాయి. భారీ వరదలకు తోడు కొండ చరియలు విరిగిపడుతుండటంతో.. వర్షాల కారణంగా కేరళలో మరణించిన వారి సంఖ్య 42కు చేరింది. మహారాష్ట్రలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. వరదల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, కేరళల్లోని తీర ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కేరళలోని వయనాడ్ మల్లపురం జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక్క కేరళలోనే 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటకలో వర్షాలు, వరదల కారణంగా 24 మంది చనిపోయారని సీఎం యడియూరప్ప తెలిపారు. 1024 గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి. 20 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 10 ఆర్మీ, 5 నేవీ, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఏపీతోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో 42 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. ఈ రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, గోవా, ఒడిశాల్లోనూ వరదలొస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.