
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సభ్య సమాజం తలదించుకునే సంఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోదరి వరుసయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోస్టుమార్టం నివేదికలో అది హత్య అని తేలడంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్‌లో ఉండే శ్వేతా లక్ష్మి కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని కారణాల రీత్యా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు సోదరుడి వరసయ్యే రమణ రావు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ భాగస్వాములకు దూరంగా ఉంటుండటంతో.. రమణారావు శ్వేతా లక్ష్మీని చేరదీస్తానని నమ్మించాడు. శ్వేతా లక్ష్మికి మాయమాటలు చెప్పి మద్యం తాగించేవాడు.. పగలు రాత్రి తేడా లేకుండా బీరు బిర్యానీలు తెచ్చుకుంటూ ఇద్దరూ అన్ని విధాలుగా ఎంజాయ్ చేశారు. రమణారావు ఎప్పుడూ శ్వేత లక్ష్మీతోనే ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. తన దగ్గరున్న డబ్బులు ఖర్చవడంతో శ్వేత దగ్గరున్న డబ్బులను కూడా రమణారావు కాజేశాడు. ఆమె దగ్గరున్న బంగారాన్ని కూడా తీసుకున్నాడు. ఆగష్టు 4న ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తన దగ్గరున్న డబ్బులు, నగల్ని రమణారావు కాజేశాడని శ్వేతా లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు మధ్య వాదులాట జరిగి, తీవ్రస్థాయిలో ఘర్షణపడ్డారు. మద్యం మత్తులో ఉన్న రమణ రావు శ్వేతా లక్ష్మిని గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపొని అతడు.. చీరతో ఉరేసి చంపేశాడు. తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. లక్ష్మిది ఆత్మహత్య కాదు, హత్యని పోస్టుమార్టం నివేదికలో తేలింది. రమణారావుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొన్నాడు. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.