YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

370... అధిక–రణం

370... అధిక–రణం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
 

తన సన్నిహితుడు షేక్‌ అబ్దుల్లాను రాజకీయంగా పైకితెచ్చే క్రమంలో భాగంగానే నెహ్రూ పట్టుబట్టి 370 ఆర్టికల్‌ వచ్చేలా చేశారు. బాబాసాహెబ్‌ అభిప్రాయాన్ని కూడా పక్కనబెట్టి, వర్కింగ్‌ కమిటీ మాట తోసిరాజని, పటేల్‌పై ఒత్తిడి తెచ్చి, కశ్మీరు ప్రధానిగా పనిచేసి వచ్చిన మిత్రుడు గోపాలస్వామి అయ్యంగార్‌ను వాడుకుని నెహ్రూ తన పంతం నెగ్గించుకున్నారు.

మనకు నచ్చలేదని చరిత్ర మారిపోతుందా? మనసు మెచ్చలేదని మాట మాసిపోతుందా? వేలి కొసన వాస్తవాలు కొలువైన ఆధునిక సాంకేతిక సమాచార యుగంలో, అబద్ధాల ప్రచారం అతుకుతుందా? బతుకుతుందా? తల నెరిసిన ఉదారవాద మేధావులు చానెళ్ల తెరలు పగిలిపోయేట్టు అరిచినా, పేజీలు చినిగిపోయేట్టు పత్రికల్లో రాసినా ఇంకు దండగే తప్ప బొంకు నిజమవుతుందా? మీడియాను కబ్జా పెట్టి అవాస్తవాలను అమ్మేందుకు ఇవి పాత రోజులు కావు. కాలం మారిపోయింది. కలం కూడా మారాల్సిన కాలమిది!

ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ యాక్ట్‌ ప్రకారం భారత్‌, పాకిస్థాన్‌ ఏర్పాటు సమయంలో, ఈ ప్రాంతంలోని 562 సంస్థానాలకూ మూడు అవకాశాలిచ్చారు. భారత్‌లో విలీనం, పాకిస్థాన్‌లో విలీనం, లేదా స్వతంత్ర దేశంగా ఉండడం! స్వతంత్ర దేశంగా ఉందామని నిర్ణయించుకున్న కశ్మీరుపై దాడి చేసింది ఎవరు? పాకిస్థాన్‌ కాదా! గిరిజనుల ముసుగులో పాక్‌ సైన్యం దాడి చేయలేదా? ఇది కదా మొట్టమొదటి చట్ట ఉల్లంఘన!

ఒక మేధావి రాసినట్టు కశ్మీరుపై భారత్‌ కన్నేయలేదు. పాక్‌ దాడికి భయపడిన మహారాజా హరిసింగ్‌... భారత్‌ను శరణు వేడారు. భారత్‌లో విలీనానికి బేషరతుగా అంగీకరిస్తూ సంతకం చేశారు. మిగతా 562 సంస్థానాధీశులు సంతకం చేసిన విలీన పత్రానికి, హరిసింగ్‌ సంతకం చేసిన విలీన పత్రానికి అక్షరం కూడా తేడా లేదు. అప్పుడు భారత్‌లో కలవబోమని కశ్మీరీలు ఏమైనా ఉద్యమం చేశారా? 1947 అక్టోబరు 26న విలీన పత్రంపై హరిసింగ్‌ సంతకం చేసినప్పుడు, ఆ మరుసటి రోజే గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ దాన్ని ఆమోదించినప్పుడు... ఎప్పుడో రెండేళ్ల తర్వాత 1949లో తెచ్చిన 370 అనే తాత్కాలిక అధికరణం ఆధారంగా ‘షరతులతో కూడిన విలీనం’ అని ఎలా నిర్వచించగలరు? ఇది కదా వాదనలోని అసలు లోపం! భారత రాజ్యాంగ రచన 1949 నవంబరు 26న పూర్తయింది. అంతకు సరిగ్గా పదిరోజుల ముందు షేక్‌ అబ్దుల్లా... ‘370 ప్రతిపాదన’తో నెహ్రూ వద్దకు వెళ్లారు.

ఆయన్ను రాజ్యాంగ సభ చైర్మన్‌ అంబేడ్కర్‌ వద్దకు నెహ్రూ పంపారు. షేక్‌ అబ్దుల్లా ప్రతిపాదన చూసిన అంబేడ్కర్‌ విస్తుపోయారు. ‘‘నవ భారత రిపబ్లిక్‌కు వెన్నుపోటు పొడవాలని నువ్వు నన్ను కోరుతున్నావా? జమ్మూకశ్మీరు ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ, మిగతా భారతీయులపై వివక్ష చూపే ప్రతిపాదనకు నేను ఎలా మద్దతిస్తాననుకున్నారు? కశ్మీరీలకు భారత్‌లో అన్ని హక్కులూ ఉంటాయా? భారతీయులకు కశ్మీర్‌లో ఏ హక్కులూ ఉండవా? నేను ఈ నమ్మక ద్రోహం చేయలేను. ఈ ప్రతిపాదనను రాజ్యాంగంలో చేర్చే ప్రసక్తే లేదు’’ అని బాబాసాహెబ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు. 370వ అధికరణాన్ని ఆమోదించిన రోజున అంబేడ్కర్‌ రాజ్యాంగ సభను బహిష్కరించి, వాకౌట్‌ చేశారు. అంబేడ్కరిస్టులుగా ప్రచారం చేసుకుంటున్న మేధావులారా? అంబేడ్కర్‌ వద్దన్నది మీకెలా ముద్దవుతోంది?

అసలు సంస్థానాల విలీనానికి, వాటిలో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరు ఎవరితో కలవాలన్నది కేవలం సంస్థానాధీశులకు ఇవ్వబడిన అధికారం మాత్రమే. (అందువల్లే హైదరాబాద్‌ నిజాం విషయంలో భారత ప్రభుత్వం మొదట్లో ఏ చర్యా తీసుకోలేకపోయింది. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించిన తర్వాత మాత్రమే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.) అంబేడ్కరే కాదు; 370 ఆర్టికల్‌ ప్రతిపాదనను నాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ముక్తకంఠంతో వ్యతిరేకించింది. ఆ ప్రతులను కాంగ్రెస్‌ నేతలు, సభ్యులు చింపి గాల్లోకి ఎగరేసి నిరసన వ్యక్తంచేశారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌పై నెహ్రూ అనుచిత రీతిలో ఒత్తిడి తెచ్చి దానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంబేడ్కర్‌ అభీష్టానికి విరుద్ధంగా, ఆయన ససేమిరా అంటే, తన సన్నిహితుడు గోపాలకృష్ణ అయ్యంగార్‌తో 370అధికరణాన్ని చేర్పించారు. భారత్‌, పాకిస్థాన్‌ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ యాక్ట్‌లో... ‘ఒక దేశంలో మరో దేశం’ అనే ఆప్షనే లేదు. ఉన్నదల్లా అయితే విలీనం కావడం లేదా స్వతంత్ర దేశంగా ఉండడం! అలాంటప్పుడు భారత్‌లోనే మరో దేశంగా కశ్మీరు ఉండేందుకు వీలు కల్పించే 370 ఎలా చట్టబద్ధం? 370 ప్రతిపాదనే ఇంత అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకమైనప్పుడు, తొలగింపు విషయంలో మనం ఏ రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడగలం? సోషలిస్టు భావాలున్న నెహ్రూకు, మహారాజైన హరిసింగ్‌కు మధ్య ఎన్నడూ పెద్దగా సత్సంబంధాలు లేవు. మరోవైపు షేక్‌ అబ్దుల్లాకు, నెహ్రూకు దగ్గరి స్నేహం.

హరిసింగ్‌పై షేక్‌ అబ్దుల్లా తిరుగుబాటు లేవదీసి ‘క్విట్‌ కశ్మీర్‌’ పిలుపు ఇచ్చినప్పుడు ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన తరఫున వాదించడానికి వెళ్లిన నెహ్రూ కూడా (1946 జూన్‌ 22న) అరెస్టయ్యారు. ‘పాక్‌ మాపై దాడిచేస్తోంది. రక్షించండి మహాప్రభో. షరతుల్లేకుండా కశ్మీరును విలీనం చేస్తా’నని హరిసింగ్‌ వేడుకోళ్లు పంపితే, షేక్‌ అబ్దుల్లా ఆమోదం ఉంటేగానీ అంగీకరించనని నెహ్రూ ప్రత్యుత్తరం ఇచ్చారు. చివరికి భారత సైన్యం కశ్మీరులోని ఒక్కో గ్రామాన్నీ వశం చేసుకుంటూ, మొత్తం కశ్మీరును విడిపించే దిశగా కదులుతుంటే, నెహ్రూ అకస్మాత్తుగా సైనిక చర్యను ఆపేశారు. కారణం, షేక్‌ అబ్దుల్లా... లోయలో మాత్రమే నాయకుడు. షేక్‌కు బలంలేని ప్రాంతం కశ్మీరులో భాగం కావడం నెహ్రూకు ఇష్టం లేదు. ఇది భవిష్యత్తులో షేక్‌ ప్రాబల్యాన్ని తగ్గిస్తుందని నెహ్రూ భయం (ప్రేమ్‌శంకర్‌ ఝా పుస్తకంలో). తర్వాత కూడా తన సన్నిహితుడు షేక్‌ అబ్దుల్లాను రాజకీయంగా పైకితెచ్చే క్రమంలో భాగంగానే నెహ్రూ పట్టుబట్టి 370 ఆర్టికల్‌ వచ్చేలా చేశారు. బాబాసాహెబ్‌ అభిప్రాయాన్ని కూడా పక్కనబెట్టి, వర్కింగ్‌ కమిటీ మాట తోసిరాజని, పటేల్‌పై ఒత్తిడి తెచ్చి, కశ్మీరు ప్రధానిగా పనిచేసి వచ్చిన మిత్రుడు గోపాలస్వామి అయ్యంగార్‌ను వాడుకుని నెహ్రూ తన పంతం నెగ్గించుకున్నారు. ఒకరకంగా 370 అధికరణం నెహ్రూ– షేక్‌ అబ్దుల్లా మధ్య వ్యక్తిగత అవగాహనలాంటిదే! దానికి ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదికగానీ, కశ్మీరీ ప్రజా ప్రయోజన భూమికగానీ లేదు.

అది పరిపాలన విధివిధానాలనే నిర్వచించింది తప్ప, ప్రజా ప్రయోజనాలను కాదు. అలాంటి 370 అధికరణాన్ని కశ్మీరీల ఆత్మగౌరవ అంశంగా ఎలా చిత్రీకరిస్తారు? 370 అధికరణం ఆధారంగా ఏర్పడిన కశ్మీరు రాజ్యాంగ సభ... భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాదాపు ఏడేళ్ల తర్వాత... 1957లో కశ్మీరీ రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ అందులో భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలు కూడా లేవు. కశ్మీరీ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లేవు. మైనారిటీల రక్షణకు చర్యల్లేవు. ‘మైనారిటీ’ అన్న పదాన్నే అది ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ఊసు లేదు. జీవిత పర్యంతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల హక్కుల కోసం కొట్లాడుతున్న ఉదారవాదులకు, ఇలాంటి రాజ్యాంగాన్నిచ్చిన ‘370’ ఎందుకు అంత ప్రీతిపాత్రంగా కనిపిస్తున్నది?

కశ్మీరు... భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని ఆర్టికల్‌ 3 స్పష్టం చేస్తోంది. భారత్‌లో జమ్మూ కశ్మీరు విలీనం న్యాయబద్ధమనీ, చట్టబద్ధమనీ ఐక్యరాజ్య సమితి స్పష్టంచేసింది. పాకిస్థాన్‌ను దురాక్రమణదారుగా ప్రకటించింది. మరి కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధురి జమ్మూ కశ్మీరు భారత్‌లో అంతర్భాగం కాదని, అది ద్వైపాక్షిక సమస్య అని లోక్‌సభ సాక్షిగా ఏ నోరుపెట్టుకుని అనగలిగారు? ‘ఒక రాష్ట్రం’గా భారత్‌తో కలిసిన జమ్మూ కశ్మీరును విడదీసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది. అద్భుతం! మరి ఒక రాష్ట్రంగా భారత యూనియన్‌లో కలిసిన హైదరాబాద్‌ స్టేట్‌ను కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నడుమ ముక్కలుగా ఎలా విడగొట్టారు? మళ్లీ దాన్ని ఆంధ్రాతో ఎలా కలిపారు? మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విడగొట్టారు? కాంగ్రెస్‌ వాదనే నిజమైతే ఒక్కో రాష్ట్రంగా భారత్‌లో కలిసిన 562 సంస్థానాలన్నీ యథాతథంగా అలాగే ఉండాలి కదా? మరి లేవేం?

ఏమిటీ కశ్మీరుకున్న ప్రత్యేకత? అది ముస్లిం మెజారిటీ ప్రాంతం కావడమేనా? కశ్మీరు విలీన సమయంలోలేని ‘ముస్లిం మెజారిటీ ప్రత్యేక భావన’ రెండేళ్ల తర్వాత ఎందుకు వెలుగులోకి వచ్చింది? 562 సంస్థానాల విలీనంలో తలెత్తని ప్రజాభిప్రాయమనే ప్రశ్న, కశ్మీరు విషయంలోనే ఎందుకు వస్తున్నది? ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతం కనుక వారి అభీష్టానుసారమే నిర్ణయం జరగాలంటే.... మరి అదే ప్రాతిపదిక దేశానికీ వర్తిస్తుందా? హిందువులు మెజారిటీగా ఉన్న దేశం కనుక వారి అభీష్టానుసారమే చట్టాలు జరగాలనే సూత్రాన్ని సోకాల్డ్‌ ఉదారవాద మేధావులు అంగీకరిస్తారా? రాజ్యాంగంలో ‘లౌకికవాదం– సెక్యులర్‌’ అన్న పదాన్ని చేర్చినపుడు స్టేక్‌హోల్డర్లయిన హిందువుల అభిప్రాయాన్ని తీసుకునే చేశారా? ఇంతకీ మేధావుల దృష్టిలో కశ్మీరులో ముస్లింలు మెజారిటీయా? మైనారిటీయా? వారు ఏమనుకున్నా... రాష్ట్రంలో 70 శాతం ఉన్నవారు మైనారిటీ అయితే కారేమో! మెజారిటీ అని అంగీకరిస్తే.. మరి మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కుల గురించి మేధావులు ఎందుకు మాట్లాడరు? ఉగ్రవాదుల రాజ్యాంగ హక్కుల గురించి అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపుతట్టే మేధావులు, వేలాది పండిట్ల ఊచకోతను ఒక్కసారైనా ఎందుకు ఖండించరు? ముస్లిములు వాడని మసీదును కూల్చివేస్తే ప్రతియేటా నల్లజెండాలు ఎగరేస్తున్న ఉదారవాదులు, కశ్మీరులో వేలాది హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే మాట్లాడరెందుకు? బుర్హాన్‌వనీ హీరోయిజాన్ని ప్రతి ఏటా స్మరించుకునే మేధావులు... కశ్మీరులో కూడా 858 మంది భారత స్వాతంత్య్ర సమరయోధులున్నారనీ, దేశమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి వారు ప్రాణాలొడ్డారనీ, పాక్‌తో పోరాటంలో అసువులుబాస్తున్న పరమ వీరాగ్రేసరుల్లో కశ్మీరీలూ ఉన్నారని ఒక్కసారైనా నివాళులర్పించరెందుకు? 370 రద్దుతో కశ్మీరియత్‌, కశ్మీరీ సంస్కృతి నాశనమైపోతుందని నెత్తీనోరూ కొట్టుకుంటున్న ఉదారవాదులు, పాక్‌ ఆక్రమిత కశ్మీరులోని ‘కశ్మీరియత్‌’ ఏమైపోయిందో ఏనాడూ నోరెత్తరెందుకు? రాజ్యాంగం, రాజ్యాంగ బద్ధత గురించి పొద్దస్తమానాలూ మాట్లాడే మేధావులు... ‘370 అధికరణం కేవలం తాత్కాలికం, సంధికాలపు ఏర్పాటు. దాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుతో ఎప్పుడైనా రద్దు చేయవచ్చు’ అని రాజ్యాంగంలోనే, ఆ అధికరణం మూడో నిబంధనలోనే రాసి ఉన్న సంగతిని ఎందుకు గుర్తించరు? కశ్మీరులో ప్రధానమంత్రి, సదరే రియాసత్‌ పదవులను కాంగ్రెస్‌ తొలగిస్తే కరెక్టట! అవే నిబంధనల ఆధారంగా మిగతా వాటిని బీజేపీ తీసేస్తే తప్పట. ఇంతకీ మేధావుల దృష్టిలో కశ్మీరీలంటే ముస్లింలేనా? అక్కడి హిందువులకు, బౌద్ధులకు, క్రైస్తవులకు, ఆదివాసీలకు, గిరిజనులకు ఏమైనా హక్కులున్నాయా? లద్దాఖ్‌ వాసుల ఆకాంక్షల సంగతేమిటి? జమ్మూ హిందువుల సంగతి ఏమిటి? మియన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింల సంక్షేమం కోసం, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన బంగ్లాదేశీ ముస్లింల హక్కుల కోసం ముందుండి పోరాడే మేధావులు... విభజన సమయంలో కట్టుబట్టలతో, పొట్ట చేతబట్టుకుని కశ్మీరుకు వచ్చి స్థిరపడ్డ లక్షలాది శరణార్థులు.. 70 ఏళ్లుగా ఎలాంటి హక్కుల్లేకుండా ఆక్రోశిస్తుంటే ఎందుకు ఉద్యమించరు? విషాదంలోనూ విశేషం ఏమిటంటే... కుల చర్చ ప్రగతి శీలమైనదనీ, మత చర్చ మౌఢ్యమైనదనీ ఇంతకాలం నమ్ముతూ వచ్చిన ఉదార వాద మేధావులు.. 370 వివాదంతో... మత హక్కుల గురించీ మాట్లాడడం మొదలుపెట్టారు!

చివరాఖరు: చిట్టచివరగా ఒకేఒక్క ప్రశ్న అడుగుతాను. ఇంతకీ భారతదేశ చరిత్రకు కటాఫ్‌ తేదీ ఏది? ఇస్లాం పుట్టిన తర్వాతే భారత్‌ పుట్టిందా? లేక అంతకుముందు భారత్‌లాంటిదేమైనా ఉందా? లేదా? కశ్మీరులో పురాతన సరస్వతీ మాత ఆలయం లేదా? ఆది శంకరాచార్యుడు కశ్మీరులో పర్యటించలేదా? కల్హణుని రాజ తరంగిణి మోగింది కశ్మీరులోనే కాదా? 11వ శతాబ్దపు కవి బిల్హణుని ప్రేమకావ్యం కశ్మీరుది కాదా? మన పురాణాలు కశ్మీరు గురించి వర్ణించలేదా? మధ్యలో వచ్చిన ముస్లిములకే అన్ని హక్కులుంటే మొదట్నుంచీ ఉన్న హిందువులకు ఎన్ని హక్కులుండాలి? అఖండ భారత్‌ లేనేలేదన్న మార్క్సిస్టు మేధావి గంగాధర్‌ అధికారి రాతలు కాదు; ఇరాన్‌ మత గురువు మహమ్మద్‌ తావీదీ ఏం చెప్పాడో సోషల్‌ మీడియాలో ఒక్కసారి వినండి. ఉదారవాద మేధావులారా... బ్రహ్మ మీ తలరాత బాగా రాయబట్టి భారతదేశంలో పుట్టి బతికిపోయారు. అదే ఏ పాకిస్థాన్‌లోనో పుట్టి ఉంటేనా... ‘బుర్ఖా’దత్‌లై తెరవెనుకే బతికి తెరమరుగు కావాల్సి వచ్చేది!!

Related Posts