నిజాయితీతో, చట్టానికి లోబడి పనిచేసే వ్యాపారవేత్తలందరికీ తమ ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. భారతీయ నేపథ్యాన్ని తెలుసుకుని వ్యాపారవేత్తలు ముందుకు వెళ్లాలని, భారతీయ మార్కెట్‌కు కావాల్సిన దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాపారవేత్తలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్ల వ్యవస్థగా ఎలా మారుస్తారన్న విజన్‌ను ఆయన వెల్లడించారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడంతో పాటు ప్రైవేటు సంస్థలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. మన పెట్టుబడిదారులు ఎక్కువ సంపాదించాలన్న ఉద్దేశాన్ని ఆయన వినిపించారు. అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను కూడా కల్పించాలన్నారు. భారత మార్కెట్ చాలా విస్తారమైనదని, ప్రగతికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రమేయం తక్కువగా ఉండి, ఎక్కువ స్థాయిలో సుపరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో తామున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అదే రీతిలో ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పెట్టుబడులను పెంచనున్నట్లు ప్రధాని తెలిపారు. ఎగుమతిదారుల్లో పోటీతత్వాన్ని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు కూడా మన మార్కెట్ నుంచి ఎంతో ఆశిస్తున్నాయన్నారు. ప్రైవేటు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. ఆర్థిక ప్రగతిని సాధించడం అంటే దేశ సంపదను సృష్టించడమని, ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వెళ్లడం కాదు, ప్రజల జేబుల్లోకి డబ్బులు వెళ్లడం అన్నారు.