ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్,లడఖ్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోడీ పిలుపునందుకుని ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు జమ్మూకశ్మీర్, లడఖ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. నేను సైతం అంటూ రిలయన్స్ కూడా జమ్మూకశ్మీర్,లడఖ్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ముంబైలో జరిగిన 42వ రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో స్వయంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. సమీప భవిష్యత్తులో జమ్మూకశ్మీర్,లడఖ్ లో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుందని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్,లడఖ్ ప్రజల అభివృద్ధి అవసరాలకు తాము మద్దతుగా ఉంటామన్నారు. ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి రాబోయే నెలల్లో జమ్మూకశ్మీర్,లడఖ్ లో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు.అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటంబాల బాధ్యతను తీసుకున్నట్లు ఈ సందర్భంగా అంబానీ ప్రకటించారు. అమర జవాన్ల పిల్లల విద్యకు సంబంధించి,అలాగే వారి కుటుంబాల జీవనభృతికి సంబంధించి తాము పూర్తి బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించారు.