తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదు అన్న చందంగా ఉంది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వేదం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు.ఉంటే మా తోనే ఉండాలి మమ్మల్ని వ్యతిరేకిస్తే దేశద్రోహులు అన్న చందంగా బిజెపి రాజకీయం చేస్తోందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా భావోద్వేగంతో కామెంట్ చేయడం ఆశ్చర్యం గా ఉందని పేర్కొన్నారు. గత ఐదేళ్ళ కాలంలో టిఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తూ ఉంటే... తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు... లేకపోతే తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించింది. ఈరోజు కేటీఆర్ గారి అభిప్రాయం ఎలా ఉందో సరిగ్గా అదే అభిప్రాయంతోనే ఇంతకాలం ప్రతిపక్షాలన్నీఅంతర్మథనంతోనుఆవేదనతోను కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషం. రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలు తో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు.