కశ్మీర్ విభజన, 370 అధికరణ రద్దుతో భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘లద్ధాఖ్ సరిహద్దుల్లోని పాక్ భూభాగంలో గల స్కర్దు ఎయిర్‌బేస్‌కు ఆ దేశం భారీ ఎత్తున సైనిక సామగ్రిని తరలించింది పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మూడు సీ-130 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు ఈ పరికరాలను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దాయాది దేశం చర్యలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. స్కర్దు ఎయిర్‌బేస్ వద్ద పాక్ యుద్ధ విమానాలను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.సరిహద్దుల్లో పాక్ కదలికలను భారత నిఘా సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. యుద్ధ విమానాల ఆపరేషన్స్‌లో ఉపయోగించే సామగ్రిని పాక్ సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక.. పాక్ తమ జేఎఫ్-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్‌బేస్‌కు తరలించే యోచనలో ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. స్కర్దు ఎయిర్‌బేస్ లద్ధాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్ చేపట్టే సైనిక ఆపరేషన్స్‌కు ఎక్కువగా ఈ బేస్‌నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆ వాయు స్థావరానికి సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల భారత్ బాలాకోట్ దాడి చేపట్టిన తర్వాత మన గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే వాటిని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. తాజాగా కశ్మీర్ అంశం నేపథ్యంలో పాక్ మరోసారి అలాంటి చర్యకు దిగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.