యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. ఈ తరుణంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలో సోమవారం జరిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా సైతం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని మన్మోహన్ గుర్తుచేసుకున్నారు. ఆయన్ని విజ్ఞానగనిగా అభివర్ణించారు. పదేళ్లు తన మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా ఆయన పని చేశారని, క్లిష్ట సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతితో భారత రాజకీయ రంగం ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. నాలుగు ప్రభుత్వాల్లో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించినా ఎటువంటి మచ్చ లేకుండా గడిపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏచూరి, రాజా సైతం జైపాల్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.