యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వెస్టిండీస్ పర్యటనలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి ఇక ఒక ఛాన్స్ మాత్రమే మిగిలి ఉంది. గాయంతో వన్డే ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఈ సీనియర్ ఓపెనర్.. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20లు, ఒక వన్డే మ్యాచ్‌లో వరుసగా 1, 23, 3, 2 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో.. టూర్‌లో మూడో వన్డే రూపంలో ఆఖరి మ్యాచ్‌కి సిద్ధమవుతున్న శిఖర్ ధావన్ మరోసారి విఫలమైతే..? అతని కెరీర్ ప్రశ్నార్థకంలో పడనుంది. విండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ని భారత్ జట్టు 3-0తో చేజిక్కించుకోగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఒక వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో గెలిచిన టీమిండియా.. బుధవారం రాత్రి ఆఖరి వన్డేలో కరీబియన్లని ఢీకొట్టబోతోంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో రెండు టెస్టులను భారత్ జట్టు ఆడనుండగా.. శిఖర్ ధావన్ స్థానంలో టెస్టులకి మయాంక్ అగర్వాల్‌ని ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో.. విండీస్ పర్యటనలో బుధవారమే రాత్రి ధావన్ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు. భారత వన్డే జట్టులో ఇప్పటికే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో పాటు ప్రత్యామ్నాయ ఓపెనర్ రూపంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. దీంతో.. శిఖర్ ధావన్ చివరి వన్డేలోనూ విఫలమైతే.. ఆ స్థానం తర్వాత సిరీస్‌ల్లో కేఎల్ రాహుల్‌కి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి