యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు అంశాల విషయంలో తమ అభ్యంతరాల్ని అంతర్జాతీయంగా ఎవరూ సమర్ధించకపోవడం పాక్ పాలకులకు వేదనను కలిగిస్తోంది. గత వారంలో భారత్ పార్లమెంట్ లో ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచీ అంతర్జాతీయ సమాజం ముందు తమకేదో అన్యాయం జరిగినట్టు వాపోతున్న పాకిస్థాన్ గోడు ఎవరు వినడం లేదు. అది భారత్ అంతర్గత వ్యవహారం అంటూ పాక్ మిత్ర దేశాలు కూడా అయ్యో అని అనకపోవడం ఆ దేశానికి పుండు మీద కారం చల్లినట్టు అవుతోంది. దీంతో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తమ దేశ పౌరులపై తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన అసహనంతో పరోక్షంగా అంతర్జాతీయ సమాజం తమ మాట పట్టించుకోవడం లేదని అంగీకరించారు.దిల్లీ హైకోర్టు అయన ఆదివారం పాకిస్థాన్ ప్రజలనుద్దేశించి ఒక ప్రముఖ చానల్తో మాట్లాడుతూ ఇలా అన్నారు. "కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. వారు(ఐరాస) మనల్ని పూలమాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డంపడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి" అని అన్నారు. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ నేపధ్యంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది పాకిస్థాన్.