యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రజనీకాంత్ అద్భుతమైన నటుడు. ఆయన విశ్వవిఖ్యాతమైన కీర్తిని చలన చిత్ర నటుడుగా గడించారు. డెబ్బయికి చేరువ అవుతున్నా కూడా ఆయన సూపర్ స్టార్ డం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఇంకా రజనీమానియా అలాగే ఉంది. ఇక రజనీకాంత్ సినిమాలు ఎప్పటికపుడు చాలించాలనుకుంటున్నారు. ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. ముఖ్యమంత్రి అవాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. నిజానికి తమిళనాడుని ఏలిన ఎమ్జీయార్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వెండితెర నాయకుడు రజనీకాంత్. ఆయన ఇమేజ్ కి గతంలో దివంగత సీఎం జయలలిత కూడా ఆశ్చర్యంతో కనుబొమలు ఎగరేశారని ప్రచారంలో ఉంది. ఇపుడు తమిళనాట అమ్మ ఎటూ లేదు. అయ్య కరుణానిధి గత ఆగస్ట్ లో కాలం చేశారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ రంగప్రవేశానికి అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు.ఇక రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వస్తారని చెబుతున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. తన పార్టీ జెండా, అజెండా సిధ్ధం చేసుకున్న రజనీ 2021 ఎన్నికలే టార్గెట్ అంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో నరేంద్ర మోడీ బంపర్ మెజారిటీతో రెండవమారు అధికారంలోకి వచ్చారు. ఆయన పాలన కూడా ఇపుడు సజావుగా సాగుతోంది. సుదీర్ఘకాలంపాటు దేశంలో సమస్యగా ఉన్న కాశ్మీర్ లాంటి వాటికి పరిష్కారం కనుగొని మోడీ అజేయుడు అనిపించుకుంటున్న సందర్భం ఇది. మరో వైపు
దక్షిణాదిని ఒడిసిపట్టాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తున్న నేపధ్యం కూడా ఉంది. సరిగ్గా ఈ సమయంలో చెన్నై వేదికగా బీజేపీ ప్రముఖులతో తమిళ సూపర్ స్టార్ దర్శనమీయడం దేశ రాజకీయాల్లో చర్చగా ఉంది. రజనీకాంత్ సొంత రాజకీయం అంటున్నా ఆయన బీజేపీకి సన్నిహితం అన్న మాట కూడా ఉంది. ఆయన మోడీతో మంచి పరిచయాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇపుడు బీజేపీలో మూల విరాట్టుగా చెప్పబడుతున్న అమిత్ షాతో కలసి వేదికపై కనిపించడంతో రజనీ బీజేపీ బంధం గట్టిపడేందుకు అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ ముందుకు వస్తోంది.తమిళనాడు ప్రజానీకానికి ఆరాధ్యదైవంగా ఉన్న రజనీకాంత్ బీజేపీ తో దోస్తీ కడితే దక్షిణాది రాజకీయాలు రసకందాయంలో పడడం ఖాయం. రజనీకాంత్ మానియా ఒక్క తమిళనాడుకే కాదు, దక్షిణాది అంతా బలంగా ఉంది. అదే సమయంలో మోడీ ఫ్యాక్టర్ కి రజనీ సాయం సమకూరితే కొత్త రాజకీయ సమీకరణలకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అదే విధంగా రజనీకి తమిళనాడులో రాజకీయ శూన్యత కలసి వచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే జయలలిత వదిలిపెట్టిన అధికారాన్ని అనుభవిస్తోంది, తాజా ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సీటు కోల్పోయిన నిస్సహాయతతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. రజనీకాంత్
సొంతంగా పార్టీ పెట్టినా, అన్నాడీఎంకే సారధ్యం చేపట్టినా కూడా బీజేపీకి సంతోషమే. డీఎంకే ని నిలువరించడం బీజేపీకి అతి ముఖ్యం. అందువల్ల రజనీకి ఎంతవరకైనా మద్దతుగా బీజేపీ ఉంటుంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్నపుడు రజనీ బీజేపీ పెద్దలతో కలసిన సందర్భం సంచలన పరిణామాలకు దారితీస్తాయని చెప్పవచ్చు