జనాభా ఏటికేడూ కోట్ల సంఖ్యలో పెరుగుతూ ఉండటం తనకు ఆందోళన కలిగిస్తోందని, ఇది దేశాభివృద్ధికి విఘాతం కాగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, చిన్న కుటుంబాన్ని కలిగివున్న వారంతా దేశాభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న వారేనని అన్నారు. దేశంపై భక్తిని చూపించాలంటే చిన్న కుటుంబాన్ని మాత్రమే కలిగివుండాలని సూచించారు. జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన మోదీ, తదుపరి తరాలు ఏ సమస్యా రాకుండా ఉండాలంటే, ఇప్పుడే జాగ్రత్త పడాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా, ఇంకా ఇండియాలో నిత్యమూ మంచినీరు లభించని కుటుంబాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయని, ఈ సమస్య మరింతగా పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.