యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జమ్మూ-కశ్మీరుపై భారత ప్రభుత్వ చర్యలపై హాహాకారాలు పెడుతున్న పాకిస్థాన్‌ను భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా ఘాటుగా హెచ్చరించారు. తమది కూడా అణ్వాయుధ దేశమేనంటూ జబ్బలు చరిచే పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా ఓ సందేశాన్ని పంపించారు.నేటి వరకు మా అణ్వాయుధ విధానం మొదట ఉపయోగించకూడదని. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో చేశారు. భారత దేశం రహస్యంగా ఐదు అణు పరీక్షలను 1998లో ఇక్కడ నిర్వహించింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తొలి వర్థంతి సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చారు.పోఖ్రాన్-2అణు పరీక్షలు 1998లో జరిగిన తర్వాత భారత దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వాయుధాలను తాను మొదట ప్రయోగించరాదని నిర్ణయించింది. అణ్వాయుధాలను కేవలం ప్రతి దాడికి మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. ఇతర దేశాల అణ్వాయుధ దాడులను నిరుత్సాహపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.2014లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా భారత దేశ అణ్వాయుధాలు ఇతరులను అణచివేయడానికి కాదని స్పష్టం చేశారు.భారత దేశం అనుసరిస్తున్న విధానం వల్ల సాధారణ అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా తదితర దేశాల నుంచి పొందగలిగింది. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ విశ్వసనీయతను పెంపొందించుకుంది.