YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో అంతా తానై...

 తమిళనాడులో అంతా తానై...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

డీఎంకే అధినేత స్టాలిన్ దూరదృష్టితో వెళుతున్నారు. రాజకీయాలకు, రక్తసంబంధాలకు జోడీ కుదరదని చెప్పకనే చెబుతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న స్టాలిన్ భవిష్యత్తులోనూ తనకు ఎదురు ఉండకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్లుంది. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే ను స్టాలిన్ తన చేతుల్లోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను ఎవరినీ పార్టీ నిర్ణయాల్లోకి జొరపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన తర్వాత వారసుడిగా ఉదయనిధిని తీసుకురావాలన్న కాంక్ష స్టాలిన్ లో బలీయంగా ఉండటంతోనే రక్తసంబంధీకులను దూరం పెడుతున్నారు.తొలుత సోదరుడు ఆళగిరిని స్టాలిన్ అడ్డు తొలగించుకున్నారు. కరుణానిధి మరణించిన వెంటనే ఆళగిరి అలజడిని ఎదుర్కొనాలంటే కుటుంబ సభ్యులందరూ ఏకం కావాలని సూచించారు. స్టాలిన్ సూచన మేరకు ఆళగిరిపై మమకారం ఉన్నప్పటికీ పార్టీ కోసం కుటుంబ సభ్యులందరూ స్టాలిన్ వెంట నడిచారు. అందులో స్టాలిన్ సోదరి కనిమొళి కూడా ఒకరు. అప్పటి పరిస్థితుల్లో ఆళగిరి వెంట కుటుంబసభ్యులెవరూ ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆళగిరి ఒంటరివాడయ్యారు. స్టాలిన్ పార్టీలో బలోపేతమయ్యారు.ఆళగిరి ముప్పు ఇప్పటికిప్పుడు స్టాలిన్ కు లేదు. తండ్రి కరుణానిధి వేసిన బహిష్కరణ వేటును ఆళగిరిపై తొలగించే అవకాశమే లేదు. అది ఉండగా ఆళగిరి పార్టీలోకి వచ్చే అవకాశమే లేదు. దీంతో ఆళగిరి సమస్య లేదని భావించిన స్టాలిన్ క్రమంగా సోదరి కనిమొళిని కూడా రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా గెలిచిన కనిమొళిని ఢిల్లీకే పరిమితం చేయాలని స్టాలిన్ భావిస్తున్నారు.కనిమొళికి క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గించాలని స్టాలిన్ నిర్ణయించారు. ప్రస్తుతం కనిమొళి డీఎంకే మహిళ విభాగం నేతగా ఉన్నారు. ఆమె స్థానంలో మరొకరికి ఆ పదవి ఇవ్వాలని స్టాలిన్ యోచిస్తున్నారు. అందుకే ఇటీవల కరుణానిధి విగ్రహావిష్కరణ సభా వేదికపై కనిమొళికి స్థానం కల్పించలేదు. వేలూరు ఎన్నిక ప్రచారానికి కూడా కనిమొళిని దూరంగా ఉంచారు. ఇదంతా కుమారుడు ఉదయనిధికి గ్రౌండ్ క్లియర్ చేయడం కోసమేనన్నది డీఎంకే లో నడుస్తున్న టాక్. మొత్తం మీద స్టాలిన్ వ్యూహాత్మకంగా తన కుమారుడికి భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరిస్తున్నారన్నమాట.

Related Posts