YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

19న కర్ణాటక కేబినెట్ విస్తరణ

19న కర్ణాటక కేబినెట్ విస్తరణ

ఎట్టకేలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరదలతో అట్టుడికిపోతున్న కర్ణాటకను ఆదుకోలేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు విన్పిస్తున్న వేళ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మంత్రి వర్గ విస్తరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 19 వతేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇప్పటికే ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఒక జాబితాను రూపొందించారు. పార్టీ రాష్ట్ర శాఖతో కలసి కూర్చుని చర్చించిన తర్వాత అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యత కల్పిస్తూ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలతో పాటు మరికొందరు పట్టున్న నేతలకు కూడా తొలిదశ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది. తొలి దశలో పదిహేను మందికి మించకుండా మంత్రివర్గాన్ని విస్తరించాలని యడ్యూరప్ప భావిస్తున్నారు.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇరవై రోజులు దాటుతోంది. అయినా మంత్రివర్గాన్ని విస్తరించలేదన్న విమర్శలు విపక్షాల నుంచి విన్పిస్తున్నాయి. అయితే వరదల కారణంగా కొంత ఈ విమర్శలు తగ్గినప్పటికీ యడ్యూరప్ప ఒక్కరే పాలన చేయడమమేంటే కుదిరేపని కాదు. పెండింగ్ లో అనేక ఫైళ్లు పేరుకు పోయి ఉన్నాయి. అనేక బిల్లులు చెల్లింపునకు నోచుకోలేదు.అన్ని శాఖల అధికారులు సీఎంఓ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో యడ్యూరప్ప తన బాధలను అధిష్టానానికి చెప్పుకోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.తొలి మంత్రివర్గంలో బసవరాజ బొమ్మై, కెఎస్ ఈశ్వరప్ప, అశోక్, గోవింద కారజోళ, జగదీశ్ శెట్టర్, బి.శ్రీరాములు, అరవింద లింబావళి, వి.సోమణ్ణ, మధుస్వామి, కోట శ్రీనివాసపూజారి, అంగార, శశికళ, సీఎస్ అశ్వద్ధనారాయణ, సి.టి.రవి, రేణుకాచార్య వంటి వారు ఉండే అవకాశముంది. ఈ పేర్లకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందే అవకాశముంది. అలాగే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయంపై కూడా బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోనుంది. వారికోసం మంత్రి పదవులు ఖాళీగా ఉంచాలన్న నిర్ణయంపై కూడా స్పష్టత రానుంది.

Related Posts