YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు

అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు

ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. కార్పోరేట్ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఫీజుల నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి విధానం లేకపోవడంతో యాజమాన్యాలే ఫీజులు ఖారారు చేసుకుంటున్నాయి. కళాశాలల ఆదాయ, వ్యయాలకు అసలు సంబంధమే ఉండటం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల బలహీనతలే ఆసరా చేసుకుని కార్పోరేట్ కళాశాలలు డే స్కాలర్ విద్యార్థులకు ఏటా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి.
అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం ఇప్పటివరకు లేవు. ఈ అంశంపై విద్యార్థులుగానీ, వారి తల్లిదండ్రులుగానీ ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు తమలో తామే మదనపడుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం నిపుణులతో కమిటీని నియమించింది. కానీ ఇప్పటివరకు ఆ కమిటీ నివేదిక బహిర్గతం కాలేదు.ప్రస్తుతం ఇంటర్మీడియేట్ బోర్డ్ సర్వీసులు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే సేవలతో పాటు ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా ఆన్‌లైన్ విధానంలోనే చేపడుతున్నారు. కానీ ప్రధానమైన ఫీజులు మాత్రం ఆన్‌లైన్‌లో చేపట్టేంపదకు వెనుకాడుతున్నారు. డిగ్రీ తరహాలో ఇంటర్‌లో కూడా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడితే కళాశాలల ఫీజులు వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.దాంతో ఆయా కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎన్నో సర్వీసులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డ్ ప్రవేశాలు, ఫీజులు మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తోంది. ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపడతామని గత నాలుగేళ్లుగా చెబుతున్నా వివిధ కారణాలు చెబుతూ ఏటా వాయిదా వేస్తూ వస్తున్నారు.ఇంటర్ విద్యార్థులకు ఫీజులకు, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ రెండింటి మధ్యన పొంతన లేకుండా పోయింది. కార్పోరేట్ కళాశాలలు ఏటా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తుండగా, నాన్ కార్పోరేట్ కళాశాలలు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1,760 మాత్రమే ఇస్తుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, బి.ఇడి వంటి వృత్తి విద్యా కోర్సులకు ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇస్తుండగా, ఇంటర్‌లో అందుకు భిన్నంగా ఉంది.జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మౌలిక సదుపాయాలున్నాయా..? విద్యార్థుల నుంచి ఎంత ఫీజులు తీసుకుంటున్నారు..? బోధించే అధ్యాపకులకు తగిన అర్హతలున్నాయా..? అన్న దానిపైనా అధికారులు నామమాత్రపు తనిఖీలతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాలలు అందుకు తగినట్లుగా సౌకర్యాలు కూడా కల్పించాలి. సరైన సౌకర్యాలు లేకుండా బ్రాండ్ నేమ్ పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

Related Posts