Highlights
- ఎవరికోసమండీ ఈ తంతు ?
ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే తంతు అంటారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్లో నడుస్తోంది. నేటి కాలం పెళ్లిళ్లు పెద్ద తంతు గా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు. మనం చెయ్యాలి . చెయ్యక పొతే నామోషీ .. ఇది నేటి రీతి .
ఒక వూళ్ళో ఒక సనాతనుడు ఉండేవారు . తరచూ హోమం చేసేవారు . హోమగుండం లో పోయడానికి నేతి ని గిన్నె లో పెట్టినప్పుడు అయన ఇంట్లో ఉన్న రెండు పిల్లులు బయటకు వచ్చి తెగ గోల చేసేవి . దీనితో హోమం అయ్యేంతవరకు పిల్లుల్ని గంప కింద ఉంచే వారు .కాలం గడిచింది . అయన వృద్ధాప్యం తో మరణించారు . కొడుకులు హోమం చెయ్యడం మానేశారు . కొంత కాలానికి వారికి హోమం చెయ్యాలి అనిపించింది . ఏమేమి కావాలో అలోచించి .. లిస్ట్ తయారు చేసారు . "అరేయ్ డాడీ హోమం జరిగేంత వరకు పిల్లుల్ని గంప కింద ఉంచేవారు . మన ఇంట్లో పిల్లులు లేవు .. గంప లేదు" అని చెప్పి బజార్ కు వెళ్లి రెండు పిల్లులను గంప కొనుక్కొని వచ్చి హోమం చేసేంత వరకు గంప కింద ఆ పిల్లుల్ని ఉంచారు .
రిసెప్షన్ - అబ్బో ఇదో పెద్ద అంతులేని తంతు . అసలు రిసెప్షన్ అంటే ఏంటి ? ఆహ్వానం . అంటే అతిథులను పెళ్ళికి ఆహ్వానించడం కదా ? కానీ నేడు జరుగుతోంది ఏంటి ? అసలు కంటే కొసరు ఎక్కువైంది . రాత్రి ఎనిమిది గంటలకు రిసెప్షన్ . అర్ధరాత్రో లేదా తెల్లవారు జామున పెళ్లి . అందరూ రిసిప్షన్ కు వస్తారు . వయసులో చిన్న వారు అయిన కాబోయే దంపతులు స్టేజి పై నిల్చుంటారు . వారి ని ఆశీర్వదించడకోసం లేదా గ్రీట్ చేయడం కోసం పెద్ద వారు క్యూ లో నిలబడుతారు . అంటే మనం పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇదన్న మాట . క్యూ చాంతాడంత ఉంటుంది . ఎప్పుడెప్పుడు స్టేజి పైకి వెళ్లే ఛాన్స్ వస్తుందా అంటూ వాచ్ చూసుకొంటూ లైన్ లో నిలబడుతారు . చివరికి ఛాన్స్ వస్తుంది . ఫోటో కోసం ఒక కృత్రిమ నవ్వు . వాళ్ళను ఆశీర్వదించడం .. పెళ్లి కాని వారిని ఆశీర్వదించడం ఏంటి ? అపచారం కాదా ? అసలు ఇన్ని గంటలకు శుభ ముహూర్తాన వారు దంపతులు అవుతారు అని నిర్ణయించడం ఏంటి ? ఆ శుభ గడియలు రాకుండానే వారిని పక్క పక్క ను కూర్చోపెట్టి ఆశీర్వచనమ్ ఏంటి ? వేదం మంత్రాలను వెక్కిరించడం కదా ? అంత అభ్యుదయ భావాలు ఉంటే సింపుల్ గా ఆదర్శ వివాహం చేసుకోవచ్చు కాదా?
చెప్పులు వేసుకొని మరి కొన్ని గంటల్లో వేదం మంత్రాలూ చదవబోతున్న స్టేజి పైకి ఎక్కడం . ఆ షూస్ ఎక్కడెక్కడ తొక్కి వచ్చిందో . పోనీ ఆచారం సంగతి పక్కన పెట్టండి కనీసం ఆరోగ్య సూత్రాల రీత్యా మంచిదేనా ? ఆ స్టేజి పైన కొన్ని గంటల పాటు వధూవరులు కూర్చొంటారు కదా ?
రిసిప్షన్ అయ్యింది . ఇక అందరూ డిన్నర్ హాల్ లో కి దూరుతారు . అక్కడ తోపులాట . తిండికి మొఖం వాచిన వారిలా తోసుకొంటూ వెళ్లి ప్లేట్ పట్టుకొని భవతి బిక్షాన్దేహి అని నిల్చుంటే ఇక అక్కడ వాడు చేతికి ప్లాస్టిక్ కవర్ వేసుకొని వడ్డిస్తాడు . అక్కడ ఎన్ని పదార్థాలు వున్నాయి అనేది స్టేటస్ సింబల్. కనీసం 30 అయినా లేక పొతే అవమానం . ఒక్కో సారి నూటయాభై దాకా ఉంటాయి . వాటిలో సగం పదార్థాలు పేర్లు జీవితం లో కనీవిని ఉండం. పర్ ప్లేట్ లెక్కన కేటరింగ్ వాడికి ఇచ్చివుంటారు . అవి చూడడానికే బాగుంటాయి . తింటే జీవితం పై విరక్తి పుట్టిస్తాయి . ఏదో ఐదో పదో పదార్థాలు రుచి చూసి ఇక జనాలు బయట పడుతారు. పెద్ద ఎత్తున ఆహారం వృధా . కడుపునిండా తిన్న వాడు ఉండడు. ఒక్క ఐటెం అయిన రుచిగా ఉంటుంది అనే భరోసా లేదు . అదో పెద్ద తంతు .
స్టేజి పైన ఫోటో అయిపొయింది . అటెండన్స్ వేసుకొన్నాం . డిన్నర్ అయ్యింది . ఇక ఏముంది ? పరుగో పరుగు . అసలు వచ్చింది దేనికి ? పెళ్ళికి ! మరి పెళ్లి చూడకుండా వధూవరులను ఆశీర్వదించకుండా ఎలా వెళుతారు ? అబ్బా .. మరీ అర్ధ రాత్రి ముహూర్తం . ఎవరు ఉంటారండీ ? అయినా ముఖం చుపించాము గా . ఇక చల్ .. పోదాం . రిసిప్షన్ అంటే పెళ్ళికి ఆహ్వానం .. ఆ ఆహ్వానము అందుకొని .. ఇంకా పెళ్లి కానీ వారిని దీవించి .. అది కూడా షూస్ తో సహా దీవించి .. ఇక పరుగో పరుగు .
రిసెప్షన్ కి రెండు వేల మంది వచ్చారు అని కేటరింగ్ వాడు చెబుతాడు . ఇక పెళ్లి మొదలయ్యేటప్పటికి పట్టున యాభై మంది లేరు . నిర్మానుష్యంగా పెళ్లి హాల్ . పోనీ ఆ కూర్చున్న వారికైనా పెళ్లి జరిపే దృశ్యం కనిపిస్తుందా అంటే జస్ట్ నో ఛాన్స్ . ముగ్గురు కెమెరా వాళ్లు.. ఇద్దరు వీడియోగ్రాఫర్స్ .. లైట్ మోసేవాడు . సీట్స్ లో కూర్చొని వారి వెనుక భాగాన్ని దివ్యదర్శనం చేసుకోవలసిందే పెళ్లి జరిగినంత వరకు .
ఎవరికోసమండీ ఈ తంతు ? ఎంత వృధా ? బంధువుల కలుసుకున్నారు కదా .. నాలుగు మాటలు మాట్లాడుకొందాం అంటే రిసెప్షన్ టైం లో ఆర్కెస్ట్రా . చెవులు చిల్లు పడే సౌండ్ . పోనీ వారు పాడే పాటల్ని అయినా వింటున్నారా అంటే ఒక్క నరమానవుడు కూడా ఆ పాటల్ని ఎంజాయ్ చెయ్యడు . వాళ్ళ పాటలు పాటలే .. వినిపించక పోయినా జనాల మాటలు మాటలే . పెళ్లి సందర్భంగా నలుగురు అనాధ పిల్లలకు భోజనం పెట్టొచ్చుగా ? వారికి మేము మీ బంధువులు అని చెప్పొచ్చుగా ? అసలు ఆ ఫుడ్ ఏంటి ? ఆ వెస్టీజ్ ఏంటీ? వేదమంత్రాల పేరుతో ఆ అపచారపు పనులు ఏంటి ? ఒక్కరైనా ఆలోచించారా ? లేదా గంప కింద పిల్లిని కప్పి హోమం చేసే తంతేనా ?....