రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. మీరు ఆర్‌టీజీఎస్ మార్గంలో ఇకపై ఉదయం 7 గంటల నుంచే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. ఆగస్ట్ 26 నుంచి పొడిగింపు వేళల నిర్ణయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమౌతాయి. ‘ఆర్‌టీజీఎస్ సేవలను మరింత సమయం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉదయం 7 గంటల నుంచే ఈ సేవలు పొందొచ్చు’ అని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అధిక మొత్తంలో డబ్బు పంపేందుకు ఆర్‌టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షల నుంచి డబ్బు పంపాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. రియల్ టైమ్‌లో డబ్బులు అవతలి వారి అకౌంట్‌కు వెళ్లిపోతాయి. ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఇటీవలనే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవలను రోజంతా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి వస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నెఫ్ట్ సేవలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ సెలవులు, రెండు, నాలుగో శనివారాల్లో ఈ సేవలు ఉండవు. రూ.2 లక్షల వరకు డబ్బులు పంపేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవలనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఆగస్ట్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. బ్యాంకుకు వెళ్లి రూ.1,000 వరకు ఇతరుకుల ఎలాంటి చార్జీలు లేకుండానే డబ్బులు పంపొచ్చు.