యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బాబు-మోడీ జోడీ.. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్. 2014 ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించి, ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి అన్నీ తానై వ్యవహరించారు చంద్రబాబు. ఆయన తెలంగాణలో సభ పెట్టినా.. చంద్రబాబును ఆహ్వానించారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఏపీ తలరాత మారడం ఖాయమని మోడీ పొగడడం, మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాని కావడం ఈ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని చంద్రబాబు ఆయనను పొగడ్తలతో ముంచెత్తడం వంటివి అప్పట్లో మనకు తరచుగా కనిపించాయి.ఇక, అదే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు-బీజేపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం, జగన్‌ను నిలువరించి అధికారం అందిపుచ్చుకోవడం తెలిసిందే. ఈ వెంటనే ఇక్కడ బీజేపీ నేతలకు పదవులు ఇవ్వగా కేంద్రంలో టీడీపీ నాయకులు మోడీ మంత్రి పదవులు ఇచ్చారు. ఇలా సాగిన బాబు-మోడీ జోడీ.. 2018 వరకు తిరుగులేని మిత్రత్వంతోనే సాగింది. ఈ నేపథ్యంలో మోడీ మాటలకు బాబు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మోడీ చెప్పడంతో సరేనని ప్యాకేజీకి ఒప్పుకొన్నారు. రాజకీయంగా ఇది తనకు ఇబ్బందని తెలిసినా బాబు సర్దుకు పోవాలని భావించారు.అయితే, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ.. ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చేసేది లేక హోదా కోసం బాబు పట్టుబట్టారు. ఇక, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులను వేరే వేరే పథకాలకు మళ్లిస్తూ.. కనీసం కేంద్రం ఇచ్చిందనే మాట కూడా చెప్పకుండానే అంతా తానే అయి వ్యవహరిస్తున్నారనే ఆగ్రహంతో మోడీ.. బాబుపై ద్వేషం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. ఇక, 2018 ఏప్రిల్ 20న తన పుట్టిన రోజు నాటి నుంచి చంద్రబాబు.. కేంద్రంలోని నరేంద్ర మోడీపై యుద్ధం ప్రకటించడం ప్రారంభించారు. ధర్మ పోరాట దీక్ష అంటూ ఆయన విజయవాడలోనే రోజు రోజంతా కూడా నిరసన వ్యక్తం చేశారు.ఇదే ఊపుతో మోడీ వ్యతిరేకులతో చేతులు కలిపారు. మోడీని ఏపీ ప్రజలు ద్వేషిస్తున్నారని భావించిన చంద్రబాబు పూర్తిగా తాను మాత్రమే మోడీపై కత్తికట్టానని చెప్పుకొచ్చారు. ఇక, అదే ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లోనూ చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ముందుకు సాగారుఇక, ఏపీకి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన మోడీ కూడా తక్కువేమీ తినలేదు. ఇది సన్(సూర్యుడు) రైజ్ స్టేట్ అయితే,ఓ పార్టీ ఇక్కడ సన్(కుమారుడు) రైజ్ రాజకీయాలు చేస్తున్న పార్టీ ఒకటి ఉందంటూ.. పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్‌ను, బాబును కూడా ఒకే టైంలో దుయ్యబట్టారు. మాటల యుద్ధం చేసుకున్నారు. మొత్తంగా బాబు వర్సెస్ మోడీ భీకర పోరు సాగింది. ఇక, ఎన్నికల రిజల్ట్ వచ్చే సరికి బాబు చతికిల పడగా.. మోడీ విజృంభించారు. మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు బాగా తెగిపోయాయి.అయితే, ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమను తాము రక్షించుకోవాలంటే. కేంద్రంలో ఉన్న పార్టీతో చెలిమి చేయక తప్పని పరిస్థితి బాబుకు ఏర్పడింది. ఇక, అదే సమయంలో ఏపీలో బీజేపీ బలపడాలనేది కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహం ఈ నేపథ్యంలోనే మళ్లీ పాత మిత్రుడు బాబుతో కలిసి ప్రయాణం చేసేందుకు బీజేపీ పెద్దలు ఎప్పుడో సిద్ధమయ్యారు.ఇక, జగన్ దెబ్బ నుంచి బయటకు పడేందుకు, అవసరమైతే.. జగన్ దూకుడును నిలువరించేందుకు కూడా కేంద్రంతో సఖ్యతతో ఉంటే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చిన అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి.. మోడీకి బాబుకు మధ్య కెమిస్ట్రీ ముడిపడుతోందని, త్వరలోనే ఈ ఇద్దరూ టీపార్టీలో కలుసుకోనున్నారని తాజాగా వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందోచూడాలి.