యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో ఒకప్పుడు జోరుగా చక్రం తిప్పిన ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి ఫ్యామిలీ ఇప్పుడు తమ అస్తిత్వం కోసం పోరు చేసే పరిస్థితి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి కొన్ని దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమార్తె పురందేశ్వరిలు.. ఇప్పుడు రాజకీయంగా తీవ్ర పోరు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో తన కుమారుడు హితేష్ చెంచురామ్‌ను రంగంలోకి దింపి.. గెలిపించు కోవాలని భావించిన దగ్గుబాటికి.. అమెరికా గ్రీన్ కార్డ్ రూపంలో భారీ ఎత్తున ఎదురు దెబ్బతగిలింది.దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు కూడా అర్హులు కాలేకపోయారు. దీంతో విధిలేని పరిస్థితిలో వెంకటేశ్వరరావే పోటీ చేశారు. నిజానికి ఆయనకు పెద్దగా పోటీ చేయాలని లేక పోయినా.. తప్పని పరిస్థితిల్లోనే నామినేషన్ వేశారు. అంతే అయిష్టంగా ప్రచారం కూడా చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ భారీ ఎత్తున కనిపించినా.. ఇక్కడ మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో దగ్గుబాటి ఓడిపోయారు. అయితే, అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. పోనీ జగన్ ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా? అంటే.. అది కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే హామీ ఇచ్చిన గొట్టిపాటి భరత్ వంటి వారు అదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. వారిని కాదని ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. దీంతో దగ్గుబాటికి ఫ్యూచర్ కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక, ఆయన సతీమణి.. పురందేశ్వరి విషయానికి వస్తే.. ఆమె బీజేపీలో ఉన్నారు. అయితే, అక్కడ కూడా ఇటీవల ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆమె కూడా అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. నామినేటెడ్ పదవో ఏదో ఒకటి దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏపీపై బీజేపీ దృష్టి పెట్టడంతో తనకు ఏదైనా పదవి ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. అయితే, ఇప్పటి వరకు బీజేపీ నుంచి అలాంటి సంకేతాలు ఏవీ కూడా కనిపించక పోవడం గమనార్హం. అటు భార్య, ఇటు భర్త ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి ఎంపీగా ఒకరు, ఎమ్మెల్యేగా మరొకరు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీరిద్దరు తాము ఉన్న పార్టీల్లోనే పట్టుకోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. మరి వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ? చూడాలి. మొత్తానికి ఇదీ దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయం .