యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ఇవాళ భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందని మోదీ అన్నారు. తాము కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, కొత్త భారత్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. ఫ్రాన్స్ ప్రజలు ఫుట్‌బాల్ ఆటను ఇష్టపడుతారని, ఆ ఆటలో గోల్ ప్రాముఖ్యత అందరికీ తెలుసు అని, గోల్ కొట్టడం అంటే అత్యున్నత లక్ష్యాన్ని చేధించడమే అని, గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం అలాంటి లక్ష్యాలనే పెట్టుకుందన్నారు. చేసిన ప్రమాణాలను మరిచే వ్యక్తిని తాను కాదు అని ఆయన అన్నారు. స్టార్ట్ అప్స్‌లో ఇండియా ముందుకు వెళ్తోందన్నారు. కొత్త దేశాన్ని నిర్మించనున్నామని, దానిలో భాగంగానే అవినీతిని అంతం చేస్తున్నామన్నారు. కుటుంబ రాజకీయాలకు కూడా చెక్ పెట్టామన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేవారిని అరికట్టామన్నారు. ఉగ్రవాదాన్ని అడ్డుకున్నామన్నారు. గతంలో ఎన్నుడూ ఇలాంటి చర్యలు గత ప్రభుత్వాలు చేపట్టలేదన్నారు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల సంరక్షణ, హెల్త్‌కేర్ లాంటి అంశాల్లో అనేక చర్యలు చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా ఎన్నడూ పార్లమెంట్ ఇంత సజావుగా సాగలేదని, గత సెషన్‌లో 75 బిల్లులు పాస్ చేశామన్నారు. చంద్రయాన్2 వ్యోమనౌక త్వరలోనే చంద్రుడిపై ల్యాండ్ అవుతుందన్నారు. అప్పుడు భారత్.. ఎలైట్ దేశాల సరసన నిలుస్తుందన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత పురోగతి దిశగా సాగుతున్నాయన్నారు. ఉగ్రవాదమైనా.. వాతావరణమైనా.. భారత్, ఫ్రాన్స్ కలిసి పోరాడుతున్నాయన్నారు. ఇండియా, ఫ్రాన్స్ దేశాలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాయన్నారు.