కాశ్మీర్ అన్నది తమ అంతర్గత వ్యవహారమని భారత్ అంటోంది. ఈ మాట ప్రతీ సారి చెబుతూనే ఉంది. ప్రతీ వేదిక మీద గట్టిగా గొంతెత్తి అరుస్తూనే ఉంది. మరి దాయాది పాక్ విషయం అలా కాదు, కాశ్మీర్ తనది కాకపోయినా ఫరవాలేదు కానీ అది భారత్ లో మాత్రం ఉండకూడదు, ఈ కుటిల నీతి పాకిస్థాన్ ది అందుకోసం ఆ దేశం ఎవ్వరినైనా రమ్మంటుంది. తనకు అండగా నిలబడమంటుంది. గత డెబ్బయ్యేళ్ళుగా ఇదే సాగుతున్న కధ. ఇక అమెరికా పెద్దన్న పాత్ర పోషించేందుకు ఎప్పటికపుడు ఉబలాటపడడం భారత్ పాలకులు దానికి తగిన జవాబు చెప్పడం కూడా సాధారణమే. ప్రపంచంలో తన పెద్దరికం నిలుపుకోవాలన్నది అమరికా ఆకాంక్ష. అయితే ఎవరో ఒకరిని భారత్ నెత్తిన రుద్ది అయినా సరే కాశ్మీర్ విషయంలో రచ్చ చేయాలన్నది పాక్ దుర్మార్గ వైఖరి.అమెరికా ప్రెసిడెంట్ పదవీ కాలం సరిగ్గా మరో ఏడాది మాత్రమే ఉంది. ఆయన ఈ మూడేళ్లలో ఏం సాధించారేంటే చెప్పుకునేందుకు పెద్దగా లేనట్లుంది. దాంతో దిగిపోయే ముందు అయినా మెరుపులు మెరిపించాలనుకుంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో పదే పదే కాశ్మీర్ అంటూ కలవరిస్తున్నారు. మోడీ తనతో కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించమని కోరారని ట్రంప్ ఆ మధ్యన అంటే భారత్ అడ్డంగా ఖండించింది. ఇపుడు మరో మారు అదే మాట ట్రంప్ నోటి వెంట వచ్చింది. అప్పటికీ ప్రధాని మోడీ కాశ్మీర్ సమస్య గురించి అంతా ట్రంప్ కి వివరించాక కూడా ఆయన అదే మాట అంటున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే మరి. ఈ మధ్యలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మాట్లాడడంతో ట్రంప్ పెద్దన్న పాత్రకు త్వరపడి మరీ సిధ్ధపడిపోతున్నారు.కాశ్మీర్లో రెండు భిన్న మతాలు ఉన్నాయని, ఆ రెండు మతలా మధ్య సాన్నిహిత్యం లేదని కూడా ట్రంప్ చెబుతున్నారు. హిందూ ముస్లిం మతాల మధ్యన గొడవలు ఉన్నాయని కూడా ఆయన అనడం ద్వారా కాశ్మీర్ విషయంలో అంతకు ముందు ఏ అమెరికా ప్రెసిడెంట్ అనని మాటలను అన్నారు. హద్దులు కూడా దాటారు. ఇలా తెంపరితనంతో ట్రంప్ మాటలు అనడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ కోరిన శరణు ఓ కారణమైతే భారత్ కూడా ఒకటికి రెండు మార్లు ట్రంప్ కు కాశ్మీర్ గురించి చెప్పడం మరో కారణం. అసలు మన దేశ వ్యవహారం ట్రంప్ కి అంతలా విడమరచి చెప్పాల్సిన అవసరం భారత్ కి ఉందా అన్నది ఒక ప్రశ్న. ఇది దౌత్య రాజకీయంలో భాగమైనా ట్రంప్ లాంటి తెంపరితనం ఉన్న నాయకుడి ముందు బేలగా మొర పెట్టుకోవడం అంటే కోరి మరీ అలుసు ఇచ్చినట్లుగానే ఉంది. అమెరికాను ఓ పెద్దన్నగా భారత్ కూడా భావిస్తోందన్న భ్రాంతిలో ట్రంప్ ఉన్నారు అంటే అందులో తప్పు లేదు కదా. అందుకే మన విదేశాంగ విధానాన్ని కూడా ఒకటికి రెండు మార్లు కరెక్ట్ చేసుకోవాలి. అంతే కాదు ఇకపై ట్రంప్ లాంటి నేతలు కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు ఆలోచించేలా గట్టిగా బదులు కూడా భారత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మెతక విధానాలు మానేసి ఇకనైనా భారత్ గట్టిగే ఉంటేనే ట్రంప్ మాటల దూకుడు ఆగుతుంది.