యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత జట్టు మాజీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు గత నెలలో ప్రకటించిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కనిపిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో సెలక్టర్లు తనని పక్కన పెట్టడంతో నిరాశ చెందిన అంబటి రాయుడు.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు జూలై నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ (టీఎన్‌ఎస్‌ఏ) వన్డే లీగ్‌లో గ్రాండ్ స్లామ్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు.. మళ్లీ టీమిండియా, ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భారత్ జట్టులోకి 2013లో అరంగేట్రం చేసిన అంబటి రాయుడు.. మధ్యలో పేలవ ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా టీమిండియాకి దూరమయ్యాడు. అయితే.. 2018 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడటం ద్వారా గాడిన పడిన ఈ తెలుగు క్రికెటర్‌కి మళ్లీ భారత్ జట్టు నుంచి పిలుపొచ్చింది. దీంతో వరల్డ్ కప్‌లోనూ నెం.4 బ్యాట్స్‌మెన్‌గా రాయుడు ఆడటం దాదాపు ఖాయమని అంతా ఊహించారు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయిన రాయుడి స్థానంలో వరల్డ్‌కప్‌కి విజయ్ శంకర్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. సెలక్టర్లపై 3D సెటైర్‌తో రాయుడు విమర్శలు గుప్పించాడు. అంబటి రాయుడు తన రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకున్నా.. భారత్ జట్టుకి మళ్లీ ఆడటం అనుమానమే. ఇప్పటికే జట్టులో యువ క్రికెటర్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొనగా.. వచ్చే ఏడాది టీ20 సిరీస్ కోసం టీమ్‌ని సిద్ధం చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. 33 ఏళ్ల అంబటి రాయుడుకి మళ్లీ చోటివ్వడం డౌటే. అయితే.. ఐపీఎల్‌లో మాత్రం ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆడే అవకాశాలుంటాయి. కెరీర్ ఆరంభం నుంచి అంబటి రాయుడు ఇలా అనాలోచిత నిర్ణయాలతోనే దోస్తీ చేస్తున్నాడు. ఐపీఎల్ సమయంలో హర్భజన్ సింగ్‌తో గొడవపడి విమర్శలు ఎదుర్కొన్న రాయుడు.. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియం వెలుపల ఒకరితో దెబ్బలాడి వార్తల్లో నిలిచాడు. గత ఏడాది భారత్ జట్టు నుంచి పిలుపురాగానే.. వెనకాముందు ఆలోచించకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఈ ఏడాది సెలక్టర్లు తనని పక్కన పెట్టారనే బాధలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. కనీసం ఐపీఎల్‌లోనైనా రాయుడు ఆడి ఉండొచ్చు కదా..? అనే అభిప్రాయాలు వినిపించాయి.