సామాజిక సమస్యలు లేని నిర్మాణాత్మక భారతదేశమే మోదీ లక్ష్యమని అన్నారు. దేశ వర్తమానం..భవిష్యత్ ప్రధాని మోదీయే అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. గడిచిన 2 నెలల్లో చాలామంది ప్రముఖులు భాజపాలో చేరారని గుర్తు చేశారు. తిరుపతిలో రామ్‌మాధవ్, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో తెదేపా సీనియర్‌నేత సైకం జయచంద్రారెడ్డి భాజపాలో చేరారు. గతంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పని చేశారు. జయచంద్రారెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా రాం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ స్వార్థం ఉన్నవాళ్లయితే అధికార వైకాపాలో చేరుతారని, దేశ ఉజ్వల భవిష్యత్ కాంక్షించేవాళ్లు మాత్రం భాజపాలో చేరుతారని ఆయన చెప్పారు. గడిచిన 70 రోజుల్లో మోదీ చూపించిన సత్తానే దీనికి కారణమని రాంమాధవ్ పునరుద్ఘాటించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వంటివి మోదీ విజన్‌కు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 70 రోజుల పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని, ఏం జరుగుతుందో బేరీజు వేసుకుంటున్నారని రాంమాధవ్ తెలిపారు. ఆంధ్రాప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున ప్రజలు మోదీతోనే ఉంటారని ఏపీ భాజపా అధ్యక్షుడు
కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వాస్తవాలు తెలియకుండా ఇన్నాళ్లూ విష ప్రచారం చేశారని దుయ్యబట్టారు. వైకాపా సహా అన్ని పార్టీల నేతలు భాజపాలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరికలు.. ప్రధాని మోదీ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు.