Highlights
- మాంగళ్య తంతే చివరి గడియలు
- కడసారిగా శ్రీవారి దర్శనం
- ఆలయ ప్రాంగణంలోనే కుప్పకూలిన వధువు
కాళ్లకు రాసిన పారాణి ఆరకముందే.. ఓ వధువు పాడిమీదకెక్కిన వైనమిది. ఆమె జీవితానికి మాంగళ్య తంతే చివరి గడియాలయ్యాయి.ఆ మూడుముళ్ల ముచ్చట కాస్తా.. ఇటు పుట్టునింట.. అటు మెట్టినింటా విషాదాన్ని మిగిల్చిపోయింది. పెళ్ళైన కొన్ని గంటలకే వధువు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. వధువు మృతితో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట పట్టణానికి చెందిన కటకం గాయత్రి కి మహబూబాబాద్ జిల్లా నెళ్లికూతురు గ్రామానికి చెందిన గుండా వేణుతో సూర్యాపేట లోని జే గార్డెన్స్ లో కన్నుల పండుగగా వివాహం జరిగింది. విహాహం అనంతరం ఆనందోత్సాహాల మధ్య ఉరేగింపుతో బయలుదేరిన నూతన దంపతులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి బయటికి వస్తున్నారు. ఆ సమయంలో వధువు గాయత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
సొమ్మసిల్లిన గాయాత్రిని సమీపంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దాంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వధువు గాయత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఉదయం తినకుండా ఉండడం వల్లనే నీరసానికి గురై ఈ దుర్ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.