యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మావోయిస్టు సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో నక్సల్స్కు వ్యతిరేకంగా చేపడుతున్న భద్రతా చర్యలను, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం నిర్వహించిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్ర కె చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. మూడు నెలల క్రితం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా నిర్వహిస్తున్న మొట్టమొదటి సమవేశంలో 10 నక్సల్ బాధిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు లేక వారి ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనవలసి ఉంది.
అయితే, మావోయిస్టులకు కంచుకోటగా గడ్చిరోలి ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సమావేశానికి గైర్హాజర్ కావడంపట్ల రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో మహాజనదేశ్ యాత్ర పేరిట రాష్ట్రంలో ప్రచారాన్ని చేపట్టే పనిలో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని, అందుకే ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదని వార్తలు వస్తున్నాయి. ఆయన తరఫున ఆ రాష్ట్ర డిజిపి హాజరయ్యారు. మావోయిస్టు సమస్యను ఎదుర్కొంటున్న 10 రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశ, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ ఉన్నాయి