YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎస్పీ, కాంగ్రెస్ లకు షాకిచ్చిన మాయావతి

ఎస్పీ, కాంగ్రెస్ లకు షాకిచ్చిన మాయావతి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చిత్రమైన నేత. తన మనసులో ఏది అనుకుంటే అది చేస్తారు. అదే బయటకు చెప్తారు. గతంలోనూ, ఇప్పుడూ ఆమెది ఒకటే ధోరణి. రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందేమోనని కూడా మాయావతి ఆలోచించరు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో 370 అధికరణం తొలగింపుపై మాయావతి భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి అందరికీ షాకిచ్చారు.నిజానికి మాయావతి సారథ్యం వహించే బహుజన్ సమాజ్ పార్టీ పేరుకు జాతీయ పార్టీగా అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ బేస్..ఓటు బ్యాంకు అంతా ఉత్తరప్రదేశ్ లోనే. తొలుత దళిత ఓటు బ్యాంకుతో పార్టీని పటిష్టపర్చుకున్న మాయావతి ఆ తర్వాత మిగిలిన సామాజికవర్గాలను సయితం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చేరువయ్యే ప్రయత్నాలు చేశారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ కలిసి పోటీ చేసినా వారి ఓట్లు ఒకరికొకరు బదిలీ కాలేదు. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు ఎక్కువ సంఖ్యలో పడినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. నిజానికి సమాజ్ వాదీ పార్టీకి పడాల్సిన ఆ సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడటం వల్లనే ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓటమి పాలయ్యామన్నది ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణల్లో తేలింది.లోక్ సభ ఎన్నికల తర్వాత మాయావతి సమాజ్ వాదీ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ అంశంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ వాయిస్ తో తన గొంతును కలిపారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే అఖిలేష్ బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ముస్లిం ఓటు బ్యాంకు ఎటూ తమకు లేదు కాబట్టి హిందూ ఓట్లను రాబట్టుకోవడానికే మాయావతి జమ్మూ కాశ్మీర్ అంశంపై కేంద్రానికి అండగా నిలబడ్డారన్న కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. రాహుల్ జమ్మూకాశ్మీర్ పర్యటననుకూడా మాయావతి తప్పు పట్టారు. మొత్తం మీద మాయావతి ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

Related Posts