YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో పతాక స్థాయికి పోరు

కర్ణాటకలో పతాక స్థాయికి పోరు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సంకీర్ణంలో ఉన్న రెండు పార్టీలకూ క్షణం పొసగడం లేదు. శాసనసభలో పెద్దగా బలం లేని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాల్సిన సిద్ధరామయ్య, కుమారస్వామి ఆ ప్రయత్నం చేయకపోగా మైత్రీ బంధానికి తూట్లుపడేలా వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పుతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్నా, కాంగ్రెస్, జేడీఎస్ లు బీజేపీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నాయి.నిన్న తండ్రి దేవెగౌడ… నేడు తనయుడు కుమారస్వామి. ఇద్దరూ తమ శత్రువు సిద్ధరామయ్య అంటూ చెబుతున్నారు. సిద్ధరామయ్య చేతకానితనం వల్లనే ఓటమి పాలయ్యామని, సంకీర్ణ సర్కార్ కుప్పకూలిందని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు గంటలు గడవకముందే కుమారస్వామి సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. తన తొలి శత్రువు సిద్ధరామయ్యేనని సంచలన ప్రకటన చేశారు. తొలి నుంచి తాను ముఖ్యమంత్రి కావడం సిద్ధరామయ్యకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.14 నెలల తన పాలనలో సిద్ధరామయ్య తన సమయాన్నంతా సొంత పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడానికే వ్యవహరించారని కుమారస్వామి ధ్వజమెత్తారు. అయితే సిద్ధరామయ్య దీనికి ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. కుమారస్వామి చేతకానితనం వల్లనే సర్కార్ కూలిపోయిందన్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోవడంతో ఇక రెండు పార్టీలూ కలిసి పనిచేయడం కష్టమేనని తేలిపోయింది. నిజానికి ఇద్దరి మధ్య యుద్ధం కొత్తేమీ కాకపోయినా బీజేపీని నిలువరించేందుకు, ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కలసికట్టుగా ఉంటారని ఇరు పార్టీల క్యాడర్ భావించింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిద్దరామయ్య సీబీఐ విచారణను కోరడం కూడా కుమారస్వామికి కోపం తెప్పించిందంటున్నారు.తనను ఇరికించడానికే సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను కోరారని కుమారస్వామి అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో రెండు పార్టీలూ విడిపోవడం బీజేపీకి లాభదాయమకమే. సిద్ధరామయ్య ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు పంపారు. పదిహేడు స్థానాలకు కొత్త అభ్యర్థుల ఎంపికను ప్రారంభించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి దీనిపై సిద్ధరామయ్య స్పష్టత తెచ్చుకునే అవకాశముంది. దేవెగౌడ కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయి అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.
ఒంటరైపోయిన సిద్దూ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒంటరి వాడయ్యారు. సిద్ధరామయ్య పై నిన్నటి వరకూ మిత్రపక్షంగా వ్యవహరించిన జనతాదళ్ ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు అండగా నిలవడం లేదు. దీనికి కారణంగా పార్టీలో సిద్ధరామయ్యపై తీవ్ర వ్యతిరేరకత ఉన్నట్లు చెప్పకనే తెలుస్తోంది. సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు లబ్ది పొందిన నేతలు సయితం ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనతాదళ్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు సృష్టించారు. తరచూ ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య విష‍యంలో ఆ పనిచేయలేకపోయింది. ఎందుకంటే సిద్ధరామయ్య బలమైన నేత కావడం ఇందుకు కారణం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలురు కావడంతోనే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా సాఫీగా కొనసాగారు.ఇక మొన్నటి ఎన్నికల్లో సిద్ధరామయ్య చాముండేశ్వరి నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ జనతాదళ్ ఎస్ కు చెందిన జీటీ దేవెగౌడ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సిద్ధరామయ్య జేడీఎస్ అంటే మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఏర్పాటయిన సంకీర్ణ సర్కార్ లో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినా సిద్ధరామయ్య కాదనలేకపోయారు. మనసు అంగీకరించకపోయినా హైకమాండ్ సూచనలకు తలొగ్గారు.అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్ లను దగ్గరకు తీశారు. సిద్ధరామయ్య సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనను లెక్క చేయకుండా కుమారస్వామి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా కుమారస్వామి, దేవెగౌడలు సిద్ధరామయ్యపై విరుచుకుపడుతున్నా కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదు. దీనికి కారణంహైకమాండ్ సూచనలేనన్న అనుమానం కలుగుతోంది. సిద్ధరామయ్య కారణంగా మిత్రపక్షమైన జేడీఎస్ ను దూరం చేసుకోకూడదన్న కారణంతోనే సిద్ధరామయ్యకు ఎవరూ మద్దతుగా నిలబడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలోనూ సిద్ధరామయ్య సింగిల్ అయ్యారన్న అనుమానాలున్నాయి.

Related Posts