యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొండా సురేఖ పార్టీ ఏదైనా తన ప్రత్యేకతను చాటుకుంటూ డైనమిక్‌గా ముందుకు సాగిన నేత. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న మహిళా ఫైర్‌బ్రాండ్ నేతల్లో ఒకరైన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు ప్రస్తుతం రాజకీయంగా కీలకమైన దశలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే...తమ రాజకీయ భవిష్యత్ క్లోజ్ అవుతుందో లేదో తేల్చుకునే పరిస్థితిలో ఈ ఇద్దరు నేతలు ఉన్నారు. తాజాగా, ఆమెకు బీజేపీ నేతల నుంచి వచ్చి న ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది అభ్యర్థుల టికెట్ ప్రకటించగా ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు మొండి చేయి చూపారు. అనంతరం తన టికెట్ ఖరారుకు సురేఖ ప్రయత్నించినా...కేసీఆర్ ఆమెను కరుణించలేదు. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ నిప్పులు చెరిగారు. మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకుపోయాను . బీసీ మహిళ అయిన నాకు నమ్మకద్రోహం జరిగిందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరరం ఢిల్లీకి వెళ్లి తన భర్త కొండా మురళితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, గత కొద్దికాలంగా వారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దగా క్రియాశీలంగా లేని నేపథ్యంలో...కొండా దంపతులు పార్టీ కార్యక్రమాలను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని టాక్. మరోవైపు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కొండా దంపతులపై నజర్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా దంపతులతో ఇప్పటికే చర్చించినట్లు టాక్. పొలిటికల్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సహజంగానే వ్యక్తమవుతోంది.