యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్.. ప్రపంచంలో అతి పెద్ద అడవులు. 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అడవులవి. బ్రెజిల్, పెరూ, కొలంబియా, వెనెజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురినేమ్, ఫ్రాన్స్ దేశాల్లో విస్తరించి ఉందది. అన్ని దేశాల్లోకెల్లా బ్రెజిల్లోనే ఎక్కువ మొత్తంలో అమెజాన్ అడవులున్నాయి. ఈ అడవుల వర్షాల పరిస్థితిని డిసైడ్ చేస్తాయి. అందుకే వాటికి రెయిన్ ఫారెస్ట్ (వర్షాల అడవులు) అని పేరు పడింది. కానీ, వర్షాలిచ్చే ఆ అడవులే ఇప్పుడు అగ్నికి ఆహుతవుతున్నాయి. బ్రెజిల్లో మూడు వారాల క్రితం రేగిన కార్చిచ్చు ఇప్పటికీ చల్లారలేదు. ఈ ఏడాది ఎనిమిది నెలల్లో ఒక్క బ్రెజిల్లోనే అమెజాన్ అడవుల్లో 75 వేల కార్చిచ్చు ఘటనలు జరిగాయి. బుధ, గురువారాల్లోనే 2,500 కార్చిచ్చులు రేగాయి. 2013 రికార్డును ఈ ఏడాది చెరిపేసింది. 2018 మొత్తం చూసినా 40 వేల కార్చిచ్చు ఘటనలు జరిగాయి. బ్రెజిల్కు చెందిన ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఇన్పె) శాటిలైట్ లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే అమెజాన్
కార్చిచ్చు ఘటనలు 85 శాతం పెరిగాయి. నిజానికి బ్రెజిల్ అమెజాన్ అడవులు జులై నుంచి అక్టోబర్ మధ్య ఎండా కాలంలో (అక్కడ ఎండాకాలం అదే టైంలో వస్తుంది) కాలిపోవడం షరా మామూలే. దానికి ప్రకృతి కారణాలతో పాటు మనిషి చేసే పనులూ కారణమవుతున్నాయి. పిడుగులతో పాటు రైతులు పంటలు, పంట కోసిన తర్వాత మిగిలే వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కూడా అడవులకు నిప్పంటుకుంటోంది. అయితే, ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అడవులు ఎక్కువగా తగలబడిపోతున్నాయన్నది ఇన్పె చెబుతున్న మాట. అంతేకాదు, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తీసుకున్న అడవుల నరికివేత వల్ల కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, స్వచ్ఛంద సంస్థలే ఇలా అడవులకు నిప్పుబెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఆయన రివర్స్లో ఆరోపిస్తున్నారు. మంటలను ఆర్పడానికి ప్రభుత్వం వద్ద సరైన వసతులు కూడా లేవన్నారు.ఈ అడవులు ఎక్కువగా ఉత్తర బ్రెజిల్లోనే తగలబడిపోతున్నాయి.
అక్కడి రోరైమా, ఎకర్, రోండోనియా, అమెజానస్లలో అగ్గిపాలవుతున్నాయి. గత నాలుగేళ్ల సగటుతో పోలిస్తే ఈ ప్రాంతాల్లోనే మంటలు ఎక్కువగా రేగుతున్నాయి. రొరైమాలో 141 శాతం, ఎకర్లో 138 శాతం, రోండోనియాలో 115 శాతం, అమెజానస్లో 81 శాతం చొప్పున అడవులు తగలబడడం ఎక్కువైంది. దక్షిణ బ్రెజిల్లో 114 శాతం ఈ కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే బ్రెజిల్లో అతిపెద్ద రాష్ట్రమైన అమెజానస్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.ప్రపంచంలోనే అతిపెద్ద అడవులివి. ప్రపంచవ్యాప్తంగా వర్షాలను అమెజాన్ అడవులు డిసైడ్ చేస్తుంటాయి. మనకు కావాల్సిన ఆక్సిజన్లో దాదాపు 20 శాతం ఉత్పత్తి చేస్తాయి. అలాంటి అడవుల్లో చాలా సహజసిద్ధమైన వనరులూ ఉన్నాయి. ఎన్నో రకాల పక్షులు, జంతువులు, వివిధ తెగల వారు
బతుకుతున్నారు. అలాంటి అడవులను వనరుల పేరిట ప్రభుత్వం ఆక్రమించేస్తోంది. ఇటు రైతులూ వ్యవసాయం పేరిట చెట్లను కొట్టేసి అటవీ భూమిలో పాగా వేస్తున్నారు. దాని వల్ల అక్కడి జీవ
వైవిధ్యంతో పాటు, అక్కడి జాతులకు ముప్పు ఏర్పడుతుంది. రైతులు పంట పండిన తర్వాత మిగిలిన వ్యర్థాలను కాల్చేయడం వల్ల అడవులకు మంటలు అంటుకుంటున్నాయి. 2017లో లీడ్స్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం అమెజాన్ అడవులు శోషించుకునే కార్బన్ డయాక్సైడ్, ఆ అడవులు విస్తరించిన దేశాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానమని తేలింది. ఒకవేళ ఈ మంటలు ఇలాగే కొనసాగి అవి నాశనమైపోతే ఆ కార్బన్డయాక్సైడ్ మొత్తం గాల్లో కలిసి గ్లోబల్ వార్మింగ్ మరింత ఎక్కువయ్యే ముప్పు పొంచి ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాటర్ సైకిల్ను అమెజాన్ అడవులే డిసైడ్ చేస్తున్నాయని తేలింది. అట్లాంటిక్ సంద్రం నుంచి వచ్చే తేమను అమెజాన్ అడవులు తీసుకుని, వాతావరణంలోకి విడుదల చేస్తాయట. ఎంత తీసుకుంటుందో అందులో సగం వర్షం రూపంలో తిరిగిచ్చేస్తుందట. కాబట్టి అవి కాలిపోతే భవిష్యత్తులో జనమూ గ్లోబల్ వార్మింగ్తో మంటెక్కిపోవాల్సి వస్తుంది.అడవులు తగలబడడం వల్ల పొగ, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లో ఎక్కువ మొత్తంలో గాల్లో కలిసిపోతున్నాయి. అది ఒక్క అమెజాన్కే పరిమితం కాలేదు. యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ అట్మాస్ఫియర్
మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) ప్రకారం అట్లాంటిక్ తీరం వరకు వ్యాపించాయి. 3200 కిలోమీటర్ల దూరంలోని సావో పాలోను దట్టమైన పొగ మబ్బులు కమ్మేసి చీకటి రాజ్యమేలుతోంది. ఈ ఏడాది
ఇప్పటికే 2,28,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లోకి విడుదలైందని కామ్స్ వెల్లడించింది. 2010 నుంచి ఏ లెక్కన చూసినా ఇది చాలా చాలా ఎక్కువని తేల్చింది. దాంతో పాటే కార్బన్ మోనాక్సైడ్ కూడా చాలా పెద్ద మొత్తంలో విడుదలవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ అమెరికా తీరాన్ని దాటి మరీ అవి వ్యాపిస్తున్నాయని వెల్లడించింది. 30 లక్షల జంతు, చెట్ల జాతులు, పది లక్షలకు పైనే ఆదివాసులుంటున్న అమెజాన్ అడవులు గ్లోబల్ వార్మింగ్ను నియంత్రిస్తోందని, ఏటా కొన్ని లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను అవి తీసుకుంటున్నాయని చెప్పింది. అయితే, చెట్లను కొట్టేయడం వల్ల అవి దాచుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని గాల్లోకి విడుదల చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.అమెజాన్ కార్చిచ్చుల ప్రభావం ఒక్క బ్రెజిల్లోనే కాదు, ఇతర దేశాలపైనా పెద్ద ప్రభావాన్నే చూపిస్తున్నాయి. బ్రెజిల్ తర్వాత ఎక్కువగా వెనెజులాలో 26 వేల కార్చిచ్చు ఘటనలు జరిగాయి. 17 వేల ఘటనలతో బొలీవియా మూడో స్థానంలో ఉంది. బొలీవియా
ఇప్పటికే మంటలను ఆర్పేందుకు ఎయిర్ ట్యాంకర్ను అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం 6 చదరపు కిలోమీటర్ల మేర మంటలు అంటుకున్నాయి. అడవుల్లోని జంతువులను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా శాంక్చువరీలను ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొందరు అధికారులనూ అక్కడికి పంపించింది.