యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి, సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన స్వర్ణ సింధు గోపిచంద్ అకాడమీలో విలేకర్లతో మాట్లాడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల కల నెలవేరింది. ఈ విజయం కోసం చాలా ఏళ్లు ఎదురు చూశా. విజయం కోసం నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న గోపి సర్‌కి, కిమ్ మేడమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం. దీనికోసం చాలా పోటీ ఉంటుందని తెలుసు. కానీ, నా వ్యూహాలు నాకున్నాయి. ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలి. సూపర్ సిరీస్‌లు ఆడాలి. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకుంటాను. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసు. కావున, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. ఈ సందర్భంగా అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మరో వైపు సింధు కోచింగ్ బాధ్యతలను కొరియాకు చెందిన కిమ్ హ్యూన్ చేపట్టారు. దాదాపు అన్ని టోర్నమెంట్లలో ఫైనల్స్‌లో ఓడిపోతున్న సింధు కిమ్ పర్యవేక్షణలో రాటుదేలింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడడంలో జపాన్, చైనా క్రీడాకారిణులు ఆరితేరిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కిమ్ సింధును బలంగా తయారు చేసింది. యమగూచి, ఒకుహర, కరోలినా మారిన్ లాంటి ఛాంపియన్ ప్లేయర్ల నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురౌతున్న నేపథ్యంలో ఆమె వారి బలహీనతలను పసిగట్టి, వాటిపైనే సింధును దృఢంగా మలిచింది. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఒకుహరతో తలపడిన విషయం తెలిసిందే. కానీ, ఆ మ్యాచ్‌లో సింధు ఒత్తిడికి లోనై అనవసర షాట్లతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. అదే ప్రత్యర్థితో మళ్లీ ప్రపంచ ఛాంపియన్ ఫైనల్లో తలపడాల్సి రావడంతో కిమ్ సింధును మానసికంగా బలంగా తయారు చేసింది. ఒత్తిడికి లోను కాకుండా మొదటి నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడాలనీ, ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. ఈ సూచనలన్నింటినీ తూ. చ. తప్పకుండా పాటించిన సింధు మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలిచేసింది. మ్యాచ్ జరుగతున్న సమయంలో గోపీచంద్ పక్కనే కూర్చున్న ఆమె సింధు పాయింట్ సాధించిన ప్రతిసారి ఆనందంతో కనిపించింది. మ్యాచ్ అనంతరం కూడా సింధును హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయింది. మెడల్ స్వీకరించిన అనంతరం సింధు కిమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.కాగా, కిమ్ 1994 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత. 1989 బాలికల జూనియర్ ప్రపంచ ఛాంపియన్. 1996, 2000 ఒలింపిక్స్‌లో ఆడిన ఈమె సుదీర్మన్,ఉబెర్ కప్ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. 2001లో బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు తీసుకుంది.