యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మోదీ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న బెంచ్‌కి ఈ కేసును బదిలీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు పట్ల మోదీ సర్కారుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అడ్వొకేట్ ఎంఎల్ శర్మ తొలి పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు చెందిన లాయర్ షకీబ్ షబీర్ ఆయనకు జత కలిశారు. ఆగష్టు 10న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా పిటీషన్ దాఖలు చేసింది. ఇవే కాకుండా చాలా మంది ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ పిటీషన్లు దాఖలు
చేశారు. ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్లో పర్యటించడానికి కేంద్రం రాజకీయ నేతలకు అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రతిపక్ష నేతలతో కలిసి రాహుల్ శ్రీనగర్ వెళ్లగా.. విమానాశ్రయం నుంచే వారిని వెనక్కి పంపించారు. కాగా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసఫ్ తరిగామీని కలిసేందుకు ఓకే చెప్పింది. కానీ ఈ పర్యటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆదేశించింది