YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెచ్చగొడుతున్న పాకిస్తాన్

రెచ్చగొడుతున్న పాకిస్తాన్

యువ్  న్యూస్ జనరల్ బ్యూరో:

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకుంది. భారత్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ అంశంలో పాక్ చేస్తోన్న వాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో మరింత అసహనం వ్యక్తంచేస్తోంది. భారత్‌తో యుద్ధం తప్పదంటూ పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోన్న పాక్.. అణు యుద్ధానికి కూడా కూడా వెనుకాడబోమని ప్రకటించింది. దీనికి అనుగుణంగానే పాక్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించి ఉద్రిక్తతలను మరింత పెంచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై అణ్వాయుధాలను ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ‘ఘజ్నవీ’ని విజయవంతంగా పరీక్షించినట్టు గురువారం పాక్ ఆర్మీ ప్రకటించింది. కరాచీ మీదుగా వెళ్లే గగనతలంలోని మూడు మార్గాలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నట్టు పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బుధవారం ప్రకటించడంతో బలూచీస్థాన్‌లో క్షిపణి ప్రయోగానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిని నిజం చేస్తూ గురువారం తెల్లవారుజామున క్షిపణిని పరీక్షిచింది. దీనిపై పాకిస్థాన్ మిలటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పాక్ తాజాగా జరిపిన క్షిపణి పరీక్షకు సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనే చేరుకునే సామర్థ్యం గలిగిన ఘజ్నవీ క్షిపణి.. వివిధ రకాల వార్‌హెడ్‌లను మోసుకుపోగలదు. భారత్‌లో పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. అత్యంత వేగంగా ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణిగా దీనిని పాకిస్థాన్ అభివృద్ధి చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. సంప్రదాయ, అత్యాధునిక పేలుడు, అణ్వాయుధాలతో కూడిన వార్‌హెడ్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఘజ్నివీను విజయవంతంగా పరీక్షించినందుకు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఆఫ్ పాకిస్థాన్ ఛైర్మన్ సహా త్రివిధ దళాలకు చెందిన అధినేతలు అభినందించినట్టు గఫూర్ తన ట్వీట్‌లో తెలియజేశాడు. అంతేకాదు, పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఈ ఘనత సాధించినందుకు తమ అభినందనలు తెలియజేసినట్టు వివరించాడు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేసి, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. దీనిని అంతర్జాతీయ అంశం చేయాలని భావిస్తోన్న పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ పదే పదే అణు యుద్ధం గురించి హెచ్చరికలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Related Posts