YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

గాజువాక గుమ్మం ఎక్కని జనసేనాని

గాజువాక గుమ్మం ఎక్కని జనసేనాని

సినీనటుడు ప్లస్ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కి గాజువాకలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. పేరుకు విశాఖ మెగా ఫ్యాన్స్ అని చెప్పుకున్నా కధ అంతా నడిపేది మాత్రం గాజువాక నుంచే. అక్కడ నుంచే మెగా క్యాంపులు, రక్తదాన శిబిరాలు, ఐ బ్యాంకులు ఇలా ఏ సేవా కార్యక్రమాలు చేయాలన్నా రాజకీయం చేయాలన్నా గాజువాక మెగాభిమానులకు పెట్టనికోట. ఇక్కడ సామాజికపరంగా చూసుకున్న కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ మెగా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఏరి కోరి మరీ పవన్ కళ్యాణ్ గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన నామినేషన్ ఘట్టం ఓ అద్భుతం అని చెప్పాలి. అన్ని పార్టీలకూ జనాల తరలింపు ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం స్వచ్చందంగా అభిమానులు వెల్లువలా వచ్చారు. వేలల్లో వచ్చి మరీ అదరగొట్టేలా పవన్ కళ్యాణ్ నామినేషన్ పర్వం హిట్ చేశారు. ఆనాటి సన్నివేశాన్ని చూసిన వారికి పవన్ కళ్యాణ్ గాజువాకలో లక్ష ఓట్ల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తాడని భావించారు.ఇక పవన్ కళ్యాణ్ చేసిన అనేక తప్పుల్లో గాజువాక ఒకటి. అక్కడ నామినేషన్ వేసిన మరునాడే భీమవరంలో నామినేషన్ వేసిన పవన్ భీమవరం తన పుట్టినిల్లు అని చెప్పేశారు. అలా గాజువాకకు గుస్సా తెప్పించారు. అంతటితో ఊరుకోకుండా తాను గాజువాకలో కాపురం ఉంటానంటూ ఓ అద్దె ఇల్లు తీసుకుని జనాలను నమ్మించాలని చూశారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా గాజువాకలో ఎక్కడా పెద్దగా చేయలేదు. పవన్ కళ్యాణ్ అనుకున్నది ఏంటంటే ప్రజరాజ్యం తరఫున ఓ సాధారణ నాయకుడు వెంకటరామయ్య ఎమ్మెల్యేగా గెలవగా లేనిది ఏకంగా పార్టీ అధినేతగా, మెగా ఫ్యామిలీ నుంచి తాను పోటీలో ఉంటే డెడ్ ఈజీగా గెలిచేస్తానని, ఆ అంచనాలే తప్పు అని జనం నిరూపించారు. రీల్ హీరో కంటే రియల్ హీరో మాకు ముఖ్యమని వైసీపీ తరఫున పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిని మంచి మెజారిటీతో ఎన్నుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ కి గాజువాక ఝలక్ ఏంటో తెలిసివచ్చింది.అయితే పవన్ కళ్యాణ్ తాను గెలిచినా ఓడినా గాజువాకను వీడనని కూడా అప్పట్లో భారీ స్టేట్ మెంట్లు ఇచ్చారు. కానీ ఇప్పటికి అయిదు నెలలు గడచినా పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాక వైపు తొంగి చూడలేదు. వంగి వాలలేదు. ఓడిపోయిన తరువాత గాజువాకలో పెట్టిన జనసేన సమీక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం జరిగినా నాగబాబుతోనె సరిపెట్టేశారు. మళ్ళీ ఆగస్ట్ నెలలో పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఉందని, గాజువాక నేతలతో భేటీ అవుతారని చెప్పినా కూడా ఎందుకో పవన్ కళ్యాణ్ రాలేదన్న అసంతృప్తి మాత్రం క్యాడర్లో ఉంది. తాము కష్టపడి పనిచేశామని, పార్టీ నిర్మాణంలో లోపాలు, ఎన్నికల ఎత్తుగడలల్లో వైఫల్యం వల్లనే పవన్ ఓటమిపాలు అయ్యారని నాయకులు అంటున్నారు.పవన్ కళ్యాణ్ గాజువాక వచ్చి జనంతో మమేకం అయితే బాగుటుందని కూడా అంటున్నారు. ఇప్పటికి అనేకసార్లు భీమవరం వచ్చి వెళ్లిన పవన్ కళ్యాణ్ గాజువాక రాకపోవడానికి కారణమేంటన్న దానిపైన జనసైనికులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గాజువాక మాజీ ఎమ్మెల్యే, జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న వెంకటరామయ్యకు సైతం పవన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి గాజువాకకు పవన్ కళ్యాణ్ వస్తారా, మళ్ళీ అక్కడ జనసేన జెండా పాతేలా కార్యక్రమాల‌కి పిలుపు ఇస్తారా అన్న దానిపై ఆసక్తికరమైన చర్చగా ఉంది.

Related Posts