YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

విశాఖలో పట్టుకోల్పొతున్న తెలుగుదేశం

విశాఖలో పట్టుకోల్పొతున్న తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న విశాఖ రూరల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న పేరు గడించిన కుటుంబాలు టీడీపీని వీడడం ఇపుడు పసుపు శిబిరంలో అలజడి రేపుతోంది. విశాఖ రూరల్ జిల్లా అంతా ఒంటి చేత్తో మోసిన వారు ఇపుడు తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల నాటికి టీడీపీ ఉండదన్న అనుమానాలే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆడారి తులసీరావు కుటుంబం చాలా ఘనమైనది. ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉంటున్నారు. అటువంటి తులసీరావు కుటుంబం మొత్తం వైసీపీలో చేరిపోతోంది. ఆడారి ఫ్యామిలీ టోటల్ గా జగన్ సమక్షంలో వైసీపీ నీడకు వస్తోంది. ఆడారి కుమార్తె, ఎలమంచిలి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ పిళ్ళా రమాకుమారి తో పాటు, తాజా ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరుతున్నారు. వీరితో పాటు నిరంతరం లాభాల బాటలో ఉన్న విశాఖ డెయిరీ తొలిసారిగా వైసీపీ పరమవుతోంది. అందులోని డైరెక్టర్లు కూడా వైసీపీలోకి వచ్చేయడంతో రూరల్ జిల్లాలోని పట్టు అంతా టీడీపీకి జారిపోయినట్లేనని అంటున్నారు.గడచిన నలభయ్యేళ్ళుగా టీడీపీకి వెన్నుదన్నుగా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఉండేవారు. ఆయన విశాఖ రూరల్ జిల్లాలో టీడీపీకి సీనియర్ నేత. అన్న గారు పార్టీ పెట్టిన వెంటనే చేరిన తొలి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు లాభాల బాటలో విశాఖ డెయిరీని నడపుతూనే టీడీపీని మరో కంట కాపాడుతూ వచ్చారు. ఆయనకు ఎన్నో పదవులు ఇస్తామని నాటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ చెప్పినా కూడా ఆయన వద్దు అని తిరస్కరించి పార్టీని రూరల్ జిల్లాలో కంచుకోటగా మార్చారు. అటువంటి ఆడారి కుటుంబం ఈ రోజు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తోందంటే ఆలోచించాల్సిన విషయమే. పైగా టీడీపీ తరఫున ఎవరు అభ్యర్ధులుగా నిలబడినా వారికి కావాల్సిన అర్ధబలం, అంగబలం సమకూర్చి విజయానికి బాటలు వేసిన ఘతన ఆడారి కుటుంబానికి ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ పునాది రాయిగా ఉన్న ఆడారి కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకోవడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. వెళ్తున్న వారు వ్యక్తులు కాదు, శక్తులు కావడంతో రూరల్ జిల్లాలో ఇక టీడీపీకి చూసుకోనక్కరలేదని, ఆ పార్టీ పతనం మొదలైందని అంటున్నారు.ఇప్పటికీ రూరల్ జిల్లాల్లో మొత్తానికి మొత్తం ఎమ్మెల్యే సీట్లను, ఒక ఎంపీ సీటుని కైవశం చేసుకున్న వైసీపీకి బలమైన గవర సమాజిక వర్గం నుంచి బలమైన వ్యవస్థగా ఉన్న ఆడారి కుటుంబం చేరడం అంటే రూరల్లో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని కూడా అంటున్నారు. ఇక మరో వైపు విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు, ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రజారాజ్యం నుంచి ఒకసారి, టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు. తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పంచకర్ల కనుక టీడీపీని వీడితే టీడీపీకి మరో దెబ్బ అని కూడా అంటున్నారు. బలమైనా కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన రాజీనామా చేస్తే ఆ ప్రభావం టీడీపీ మీద గట్టిగా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తానని పదే పదే నేతలకు చెబుతున్నా కార్యకర్తల్లో మాత్రం ఆ ధైర్యం రావడం లేదని అంటున్నారు. అలాగే నేతలకు కూడా మళ్ళీ పార్టీ గెలుస్తుందన్న ఆశలు లేవని అందువల్లనే టీడీపీని వీడిపోతున్నారని అంటున్నారు. చూడాలి మరెంతమంది పార్టీని వీడిపోతారో.

Related Posts