తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లా కొక స్టాండ్ ను తీసుకుంటున్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు వరస కేసుల్లో ఇరుక్కుంటున్న సమయంలో ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్ పై ఇప్పటికే కేసు నమోదయింది. అదే జిల్లాకు చెందిన యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ కత్తి వేలాడుతోంది. అయితే గుంటూరు జిల్లా నేతలు ఎవరూ ఈ ఇద్దరికి మద్దతుగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో మాజీ విప్ , టీడీపీ నేత కూన రవికుమార్ పై కూడా కేసు నమోదయింది. ఆయన ఐదు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. కూన రవికుమార్ టీడీపీ నేతగా స్పందన కార్యక్రమానికి వెళ్లి అక్కడ ప్రభుత్వోద్యోగుల పై దుర్భాషలాడారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూన రవికుమార్ తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడి తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కూన రవికుమార్ కు అండగా నిలబడ్డారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూన రవికుమార్ పై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సయితం కూన రవికుమార్ ను వెనకేసుకొచ్చారు. పోలీసులు కూన రవికుమార్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అవసరమైతే దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కూన రవికుమార్ కు టీడీపీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు.కానీ సిక్కోలు టీడీపీ నేతల్లాగా గుంటూరు జిల్లా టీడీపీ నేతలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, సీనియర్ నేతలు ధూళిపాళ నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవీ ఆంజనేయులు, రాయపాటి సాంబశివరావు వంటి నేతలున్నప్పటికీ వారు కోడెల, యరపతినేని విషయంలో స్పందించలేదు. అయితే కూన రవికుమార్ కేసు వేరని, కోడెల, యరపతినేని కేసులు వేరని గుంటూరు టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ పార్టీలో మాత్రం కోడెల, యరపతినేనికి మద్దతిస్తే తామెక్కడ టార్గెట్ అవుతామోనని భయపడే వారు బయటకు రాలేదన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.