అమెరికా యుద్ధ హెలికాప్టర్లు అపాచీ ఏహెచ్-64 ఇవాళ భారత వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరం నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి. అంతకంటే ముందు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్‌తో పాటు పలువురు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అపాచీ యుద్ధ విమానాలు.. వాటర్ కెనాన్ వందనాన్ని స్వీకరించాయి. అనంతరం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఇవాళ కొత్తగా వాయుసేనలో 8 అధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు చేరాయి. ఇప్పటికే 4 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ భారత్‌కు అప్పగించింది. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళానికి ఇవాళ మరో 8 హెలికాప్టర్లను అప్పగించింది బోయింగ్ సంస్థ. ఇప్పటి వరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు బోయింగ్ సంస్థ అందించింది. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్‌లో భారత వాయుసేన బోయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 2020 నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత్‌కు చేరనున్నాయి. అపాచీ యుద్ధ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్ 16వ దేశం.