యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తమిళనాడులో మంచి క్రేజ్ ఉన్న నేత విజయకాంత్. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పటికీ తమిళనాడులో ఆయనకంటూ కొంత ఓటు బ్యాంకు ఉంది. డీఎండీకే ను స్థాపించి ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా తమిళనాడు శాసనసభలో వ్యవహరించారు. అయితే కెప్టెన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని కూడా వచ్చారు. కెప్టెన్ ప్రచార సభల్లోనూ పాల్గొనలేకపోతున్నారు.దీంతో విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీతో కలసి బరిలోకి దిగినా ఫలితాలు సాధించలేక పోయారు. కెప్టెన్ ప్రచారంలో పెద్దగా పాల్గొనలేకపోవడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని ఇప్పటికీ కెప్టెన్ అభిమానులు నమ్ముతారు. అలాంటి కెప్టెన్ విజయ్ కాంత్ పార్టీ బాధ్యతలను తన తనయుడు విజయ ప్రభాకర్ కు అప్పగిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.డీఎండీకేలో గత ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ సతీమణి ప్రేమలత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆమె పార్టీ కోశాధికారిగా ఉండటంతో టిక్కెట్ల కేటాయింపులోనూ డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరు నేతలు ఏకంగా ప్రేమలతపై ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు కూడా. దీంతో ప్రేమలత ప్రాధాన్యతను కొంత మేరకు తగ్గించాలని విజయ్ కాంత్ ఆలోచించినా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదు.ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. దీంతో తన తనయుడు విజయ్ ప్రభాకర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని విజయ్ కాంత్ నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల వరకూ విజయ్ కాంత్ పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారు. అయితే విజయ్ ప్రభాకర్ కు మాత్రం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. సెప్టంబరు 15వ తేదీన విజయ్ కాంత్ నుంచి ఈ ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే స్టాలిన్ తనయుడు ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.