యువ న్యూస్ కల్చరల్ బ్యూరో:
వైదిక ధర్మం ఎవరి కోసం:
భగవత్ రామానుజాచార్యులవారు అందించిన సనాతన వైదిక ధర్మాన్ని ఉపనిషత్తుల సారంగా భగవానుడు భగవద్గీతలో ప్రతిపాదించిన మార్గాన్నే వారు మనకి ఆందించారు. వైదిక ధర్మం ఎవరికి చెందినది అంటే వీళ్ళు వాళ్ళు కాదు బాగుపడాలి అనే కోరిక కల్గిన ప్రతి వ్యక్తికీ చెందినడి అనే మనకు వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవద్గీతా అదే చెబుతుంది. భగవద్గీతలో దీన్ని ఎవరి గురించి ఈ గ్రంథం చెబుతున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా భగవానుడు జిజ్ఞాస కల్గిన మానవులందరి గురించి అని చెప్పాడు. ఎవడైనా తప్పులు చేసినవాడైతే తొలగించుకోని రావాలా అంటే ఎలా వచ్చినా పరవాలేదు నా దగ్గరికి వస్తే చాలును అని తొమ్మిదవ అధ్యాయంలో తన ఔదార్యాన్ని ప్రకటించాడు ఒక శ్లోకంలో.
అపిచే సు దురాచారః భజతేమా అనన్యభాత్ |
సాదురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితోహి సహ||
"అపిచే సు దురాచారః" నన్ను చేరని ముందు చెయ్యవలసినవి మాని, కూడని పనులు చేసేవాడై ఉన్నప్పటికీ "అనన్యభాత్" ఇతరమైనవాటి యందు విశ్వాసం వదిలి "భజతేమా" నన్నే కనక వాడు ఆశ్రయించినట్లయితే వాన్ని నేను "సాదురేవ" సజ్జనుడు అంటా. అంతే కాదు "సమంతవ్యః" ప్రతి ఒక్కరూ వాన్ని గౌరవించితీరవల్సిందే. ఎందుకంటే "సమ్యక్ వ్యవసితోహి సహ" వాడికున్న జ్ఞానం ఎవ్వరి యందు చదరక అచలంగా ఉంది కనక. అచలం, నిశ్చలం రెండు కదలనివి అని అర్థం. అయితే ఈ రెంటిలోనూ తేడా ఉంది. ఒక పాత్రలో నీరు ఉండే స్థితిని నిశ్చలం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ నిశ్చలమైన నీటిలో ఏదైన మరొక ద్రవాన్ని లేక పదార్థాన్ని కలిపితే కలిసిపోవును. కానీ అదే నీరు ఘనీభవించి ఒక మంచువలే ఉంటే అదీ కదలక ఇక వేరే ఏ ఇతరమైనవాటికి తనలో కలుపుకోక ఉండును కదా, అదే స్థితిని అచలం అని అంటారు. భగవద్గీతలో భగవానుడు కోరినది ఇలాంటి విశ్వాసాన్నే! అలాంటి విశ్వాసం కల్గిన తన భక్తులను అందరిచే పూజించబడేట్టు చేస్తాడు. హే అర్జునా! నాయందు అచలమైన విశ్వాసం కల్గి ఉండి, నన్ను గుర్తించక ముందు వాడు ఎట్లాంటివాడైనప్పటికీ వాడిని నీవూ ఆరాదించవలసిందే! "తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యః యదాహి అహం" నన్నెలా ఆరాధిస్తున్నావో వాన్నీ ఆరాధించతగును సుమా. ఇది భగవంతుని శాసనం.
అలాంటివారు చాలా మంది ఉన్నారు. మనం పూజించే ఆళ్వారులు అలాంటి వారే. మన ఆళ్వారులందరూ భగవంతున్ని గుర్తించక ముందు అనామకులుగా ఉన్నవారే. ఒకప్పుడు వీరు చెడిపోయిన వాల్లు, ఒక్కొక్క సారి భ్రష్టులైనవాల్లు, ఒక్కోసారి అతినీచ ప్రవృత్తి కల్గిన వారు. కానీ భగవంతున్ని గుర్తించాక వీరు ఆయన యందే ఏకాగ్రమైన దృష్టి కలవారు. వారినే మనం ఆళ్వారులు అంటాం. అందులో తిరుమంగై ఆళ్వార్ ఒక దొంగ, ఈనాడు మనం వారిని పూజ చేస్తున్నాం. తిరుప్పాణి ఆళ్వార్ ఒక హరిజనుడు, ఈనాడు మనం వారిని పూజ చేస్తున్నాం. తొండర్ పొడి ఆళ్వార్ ఒక పతితుడు, ఈనాడు మనం వారిని పూజ చేస్తున్నాం. చతుర్థవర్ణంలో పుట్టినవారు నమ్మాళ్వార్, ఈనాడు మనం ఆరాధన చేస్తున్నాం. మేదరి కులంలో పెరిగిన వారు, భక్తి సారులు వారిని మనం ఆరాధన చెస్తున్నాం. అంటే వారి ఆదిజాత్యాన్ని పక్కకుపెట్టి, కేవలం వారికి భగవంతుని యందే ఏకాగ్రత ఉన్నదా లేదా అన్నదే మనం చూస్తున్నాం. భగవంతుని విషయంలో సమయాన్ని బట్టి మార్పు రాకూడదు. ఒకడియందే పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. శ్రీకృష్ణుడి యందు లేకుంటే ఎవరో ఒకరు కానీ వారియందే పరిపూర్ణ విశ్వాసం ఉండగలగాలి. ఒకడిపై విశ్వాసం అనేదాన్ని ఏర్పరుచుకుంటే అప్పుడు అంతిమ లక్ష్యంగా శ్రీకృష్ణుడు ఎప్పటికీ ఉన్నాడనేదే కృష్ణుడే చెప్పాడు. అలా తననే విశ్వసించినవాడిని పరమాత్మ శిరసాదరిస్తాను అని చెప్పాడు పరమాత్మ. దీన్ని విశ్వసించే పరంపర రామానుజ పరంపర.