యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది.
ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!