YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చిద్దూకు మరో షాక్

చిద్దూకు మరో షాక్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి గురువారం మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ముందుస్తు బెయిల్ కోసం ఆయన దాఖలుచేసిన పిటిషన్‌‌ను జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బొపన్నల ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చిదంబరానికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఇప్పటికే ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీం తిరస్కరించడంతో సీబీఐ కేసులో బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ను వెనక్కుతీసుకోవాలని చిదంబరం నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు అనుమతించింది. చిదంబరం తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అయితే, సాధారణ బెయిల్ కోసం చిదంబరం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. తన తీర్పులో ఏజెన్సీ నోట్ కాపీ పేస్ట్ చేసినందుకు హైకోర్టు న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక నేరాలు వేర్వేరు ప్రాతిపదికన ఉంటాయని, వీటిని భిన్నమైన విధానంతో పరిష్కరించుకోవాలన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఆయన్ను తీహార్ జైలుకు తరలించవద్దని మంగళవారం ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల తరలింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో చిదంబరంపై కేసు నమోదుచేసి సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కూడా మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పడంతో ఆయన సీబీఐ కస్టడీలోనే కొనసాగుతున్నారు

Related Posts