యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆసియా దేశాలకు తెల్లవారేలోపు... అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. అదే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్... ల్యాండింగ్. శుక్రవారం రాత్రి దాటాక... 1.40 నుంచీ 1.55 మధ్య ఈ ప్రయోగం జరగనుంది. ఈ 15 నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. మనకైతే పెద్దగా టెన్షన్ ఉండదు గానీ... ఇస్రో శాస్త్రవేత్తలకైతే ఊపిరాడదు. క్షణక్షణం ఉత్కంఠే. ఈ క్షణాల కోసమే వాళ్లు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. 48 రోజుల కిందట... చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్షంలోకి వెళ్లిన ఆర్బిటర్ ప్రయాణం... క్రమంగా భూమికి దూరమవుతూ... చందమామకు దగ్గరవుతూ సాగింది. నాల్రోజుల కిందటే... చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచీ... విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. అది చందమామ చుట్టూ తిరుగుతూ... క్రమంగా చందమామకు అత్యంత దగ్గరగా చేరువైంది. ప్రస్తుతం అది చందమామకి 35 కిలోమీటర్లు దగ్గరగా... 101 కిలోమీటర్లు దూరంగా ఉంది. రాత్రి 1.40కి అది చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది. ప్రస్తుతం చంద్రయాన్-2 ఆర్బిటర్... చందమామకి 96 కిలోమీటర్లు దగ్గరగా, 125 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో తిరుగుతోంది.రాత్రి 1 తర్వాత చందమామ దక్షిణ ధ్రువంలోని రెండు లోయల మధ్యలో ఉన్న సమతలమైన స్థలంలో విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఆల్రెడీ ముందుగా అనుకున్న స్థలం సరిగా లేదని భావిస్తే... ఆ చుట్టుపక్కల మరో స్థలాన్ని ఎంచుకుంటారు శాస్త్రవేత్తలు. స్థలం ఎలా ఉందో చూసేందుకు చంద్రయాన్-2 ఆర్బిటర్‌కి అమర్చిన ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ఉపయోగపడనుంది. ఇలా స్థలాన్ని వెతకడానికి అరగంట సమయం కేటాయిస్తున్నారు. అందువల్ల 1-40 సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందన్నమాట. అలా దిగే సమయంలో దాని వేగం సెకండ్‌కి 3 అడుగులు ఉంటుంది. ఇలా దిగడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగంలో ఈ 15 నిమిషాలూ... అత్యంత కీలకమైనవి. ఇది ల్యాండింగ్ సక్సెస్ చెయ్యడం అత్యంత కష్టమైన పని. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ప్రయోగమే వేస్టవుతుంది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలా ల్యాండింగ్ చెయ్యగలిగాయి. అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు ఇప్పుడు నిద్ర పట్టని పరిస్థితి. ఊపిరి బిగపట్టి అంతా ఈ ప్రయోగ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు.ఆసియా దేశాలకు తెల్లారిన తర్వాతమరో ప్రయోగం జరగనుంది. అదే రోవర్ రాక. సరిగ్గా ఉదయం 5.30 నుంచీ 6.30 మధ్య... విక్రమ్ ల్యాండర్ బాక్సులో నుంచీ 27 కేజీల బరువుండే ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. దానికి ఆరు చక్రాలుంటాయి. అది బయటకు రాగానే దాని సోలార్ ప్లేట్లు తెరచుకుంటాయి. వెంటనే అది సూర్యరశ్మిని స్వీకరిస్తూ... పని మొదలుపెడుతుంది. చుట్టుపక్కల అంతా ఫొటోలు తీస్తుంది. అలాగే... అక్కడే ఉండిపోకుండ ఓ 500 మీటర్లు ప్రయాణిస్తుంది. ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు. ఇందుకు 14 రోజులు పడుతుంది. అంటే... అది మెల్లమెల్లగా వెళ్తుందన్నమాట. నెమ్మదిగా ఎందుకంటే చందమామపై స్థలం ఎలా ఉందో చూసుకొని... రాళ్లూ, రప్పలను దాటుకుంటూ... జాగ్రత్తగా వెళ్తుంది. అలా వెళ్తు... ప్రతీదీ ఫొటోలు తీస్తూ ఉంటుంది. అందుకే నెమ్మదిగా వెళ్తుందన్నమాట. ప్రజ్ఞాన్ రోవర్ పంపే సమాచారం మొత్తం... ముందుగా... విక్రమ్ ల్యాండర్‌కి చేరుతుంది. అక్కడి నుంచీ బెంగళూరుకి దగ్గర్లోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు చేరుతుందిఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి చూస్తారు. దేశవ్యాప్తంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో నిర్వహించిన పోటీల విజేతల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ప్రధానితో కలసి ఈ ల్యాండింగ్‌ను చూస్తారు. దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక ముందడుగు వేసినట్లవుతుంది. ఇప్పుడు 500 మీటర్లు మాత్రమే వెళ్లే రోవర్... భారత భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఓ చరిత్రాత్మక ముందడుగు కాబోతోంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్... జస్ట్ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అమావాస్య మొదలవుతుంది. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రాంతంలో... ఎండ పడదు. అందువల్ల అవి రెండు గడ్డకట్టి పనిచేయకుండా పోతాయి. 14 రోజుల తర్వాత తిరిగి ఎండ వచ్చినా... అవి పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదు. ఒక వేళ పనిచేస్తే... అదృష్టమే అంటున్నారు శాస్త్రవేత్తలు.