YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఉషా గోపాల్ కొండముది: జ్ఞానస్వరూపిణి ఉమాదేవి

ఉషా గోపాల్ కొండముది: జ్ఞానస్వరూపిణి ఉమాదేవి

పరమాచార్యులఅమృతవాణి : జ్ఞానస్వరూపిణి ఉమాదేవి

(జగద్గురుబోధలనుండి)

ఉపనిషత్తులను వేదశిఖరాలని అంటారు-

ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి.
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ.’

అనే దశోపనిషత్తులూ ఉపనిషత్తులలో ముఖ్యాలు. ‘ఈశావాస్య మిదం సర్వమ్‌‘ అని ఆరంభం చేసినందువల్ల ఒకదానికి ఈశావాస్యోపనిషత్తు అనిపేరుపడ్డది. రెండవది కేనోపనిషత్తు. కొన్ని ఉపనిషత్తులు కథామూలకంగా తత్త్వబోధ చేస్తాయి. ఈ క్రింది కథ కేనోపనిషత్తులోనిది.

వెనుక ఎప్పుడో దేవతలకూ దానవులకూ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దానవులు ఓడిపోయారు. గెలుపు దేవతలది అయింది. అప్పుడు వారి సంతోషం ఇంత అంత అని చెప్పతరం గాకపోయింది. గెలిచాముగదా ఇంకేం విజయోత్సవం చేసి కొందాం అని అనుకొన్నారు. ఆ విజయానికి కారణం అంతా తమ శక్తి సామర్థ్యాలే అని అనుకొన్నారు. వారందరికీ అహంభావం పెరిగిపోయింది. నేనింతవాణ్ణి నేనంతవాణ్ణి అని స్వోత్కర్షకు పూనుకున్నారు. పరమాత్మ వాళ్ళ అహంభావం కనిపెట్టాడు. వీళ్ళకున్న ఈ దుర్బుద్ధి పోతేగాని వీళ్ళకు క్షేమం లేదని అనుకొన్నాడు. బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.

దేవతలకు అల్లంత దవ్వులో భూమీ ఆకాశమూ నిండేటటులు చూడడానికి వీలులేని ఒక ప్రకాశం ఆవరించింది. దానిని చూచిన దేవతలకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటో తెలియ డంలేదే! సర్వజ్ఞులమయిన మన బుద్ధులకుకూడా ఇదేదో అతీతంగా ఉన్నదే? అని వారు అనుకొన్నారు. పోయి దాన్ని పరిశీలించి రమ్మని అగ్నికి ఆజ్ఞ ఇచ్చారు. అగ్ని ఆ ప్రకాశం ఉన్నచోటికి అడుగులు వేసుకుంటూ నడిచాడు. ఆ జ్యోతి భూమ్యాకాశాలకు కట్టిన పెద్దవంతెనవలె మహోన్నతంగా అఖండంగా ఉన్నది. దానికి ప్రాణం ఉన్నట్టు గూడా గోచరించింది. ‘నీవు ఎవరు’ అని అడుగుదామని అగ్ని అనుకుంటూ ఉండగానే ఆ ప్రకాశమే ఆ ఇంద్రజాలమే అగ్నిని ‘నీవెవరు’ అని అడిగింది.

నేనా నేను అగ్నిని జాతవేదుడను.

నీకేమి శక్తులున్నాయ్‌ ?

నేను దాహకుడను. ఏ వస్తువునైనా నేను ఇట్టే కాల్చి పారేస్తాను.

ఏదీ నీ శక్తి కాస్త చూద్దాం. ఈ గడ్డిపోచను కొంచెం కాల్చి చూడు, కాల్తుందేమో.

అగ్ని ఇంతేనా అని నవ్వుకొన్నాడు. గడ్డిపోచకు దాపుగా వెళ్లేడు. అది కాలలేదు. ఇదేమిటీ విచిత్రంగా వుందే అని అనుకొని తన వేడి నంతటినీ కేంద్రీకరించాడు. ఉహు. ఆ గడ్డిపోచ ఎలావుందో అలాగే చెక్కుచెదరక ఉన్నది. అగ్ని అవమానంతో వెనుదిరిగేడు. అగ్ని చెప్పిన సమాచారం ఆశ్చర్యంగా విన్నారు దేవతలు. ‘అగ్నికిచేత కాలేదూ పోనీ నీవైనా వెళ్ళి దాని తంతు ఏమిటో కనుక్కొని రారాదూ’ అని అందరూ వాయుదేవుని ప్రోత్సహించారు. ప్రభంజనుడు సరే అన్నాడు.

అగ్నిది దాహకశక్తి, వామువుది కదిలించి దవ్వులకు విసరిపారవేసే శక్తి. అగ్నికి ఆ యక్షీణికీ ఏ విధంగా మాటలు జరిగినవో అదే విధంగా వాయువునకూ యక్షిణికిన్నీ సంభాషణ జరిగింది. వాయువు ‘నేను దేనినైన విసిరి పారేస్తాను’ అని అన్నాడు. నాపేరు ‘మాతరిశ్వ’ అన్నాడు. కాని పరీక్షలో అగ్నివలెనే ఓడిపోయాడు. సప్తజిహ్వుడూ సమీరుడూ సాధించలేని కార్యం సహస్రాక్షుడు కాకపోతే మరెవరు సాధించగలరు?

ఇంద్రుడు ఆలోచింపసాగేడు. జయం కలిగినది కదా అని ఆనందంగా ఉంటే ఈ వెలుగు గొడవ ఒకటి వచ్చి పడిందే, ఈ వెలుగుకు ఎంత శక్తి ఉందో, ఎంత శక్తి లేనిదే అగ్నిదేవునికి వాయుదేవునికి సులభంగా శృంగభంగంచేసి వెనుకకుమరలగొట్ట గలుగుతుంది? యోచించేకొద్దీ అహంభావం కొంత కొంతపోయి పరమాత్ముని గురుతు ఆ దేవతా ప్రభువుకు కలుగసాగింది.

ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ ఆ కాంతిపుంజాన్ని సమీపించగానే ఆ వెలుగుకూడా మెలమెలగా కరిగిపోయి ఆ చోట ఆ వెలుగుకు బదులు పరమకరుణాస్వరూపిణియైన ఒక స్త్రీ స్వరూపం పొడగట్టింది. స్వర్ణాభరణభూషిత, హిమగిరిసుత ఐన ఉమ ఆకాశమధ్యంలో గోచరించింది.

ఆ జ్ఞాన స్వరూపిణికి స్వర్గాధిపతి నమస్కరించాడు. ‘ఇంతవరకూ ఇక్కడే ఉండి దేవతలను చిక్కు పెట్టుతున్న ఈ యక్షిణి ఈ ఇంద్రజాలం, ఈ ప్రకాశం ఏమిటో తెలియడం లేదు. దీని తాత్పర్యం ఏమిటీ తల్లీ!’ అని అడిగేడు.

‘నీవు చూచింది బ్రహ్మస్వరూపము. ఈ ప్రపంచానికీ దేవదానవుల కందరకూ మరి అన్నిటికీ కారణం ఆ యక్షిణి. ఆ ఇంద్రజాలమే, ఆ ప్రకాశమే కారణం. ఈ లోకంలో నానా నామరూపాలతో నయనాలకు గోచరించేదీ ఆయనే‘ అని అంబ అమరేంద్రునికి బోధచేసింది.

మనం ఒక్కొక్కప్పుడు బుద్ధి చెప్పడం కోసం ఒకనిని అవమానింపవలసి వస్తుంది. దాని ఉద్దేశం మనస్సుకు నొప్పి కలగజేయడం కాదు. అహంభావాన్ని తొలగించడం అహంభావం పోయిన క్షణమే అనుగ్రహమున్నూ చేయాలి. ఇంద్రునకు ఎప్పుడు అహంభావం పోయిందో అపుడే అంబిక అతనిని అనుగ్రహించింది. తక్కినవారు చూచినప్పటికీ బ్రహ్మస్వరూపం అవగతం కాలేదు. వారికి తమ తమ అహంభావమే అడ్డు వచ్చింది. ఇంద్రుడొకడు ముమ్మెదట కొంత కొంత అహంభావ పడినా దానిని అణచు కొన్నందువల్ల భగవంతుని గుర్తు తెచ్చుకొన్నందువల్ల బ్రహ్మస్వరూపం తెలుసుకోడమే కాకుండా అంబికా దర్శనభాగ్యమూ, ఆ జ్ఞానస్వరూపిణి నుండి ఉపదేశ భాగ్యమూ పొందగలిగేడు. అందుకే అతనిని ఇంద్రుడని అన్నారు.

జ్ఞాన స్వరూపమే ఉమ. సర్వజ్ఞుడైన ఈశ్వరుని సహచారిణి ఆమె. అగ్ని దాని దాహకశక్తీ, పూవూ దాని తావీ అమృతమూ దాని తీపీ ఎట్లా ఒకదానిని వదలి మరొకటి ఉండదో అట్లే జ్

ఞానప్రసూనాంబిక ఉమ. ఆ సర్వజ్ఞ అర్ధాంగిగా ఆ పరమకారణంలో అవినా భావంగా ఉన్నది. ఆచార్యుల వారు భాష్యంలో ‘నిత్యమేవ సర్వజ్ఞే నేశ్వరేణ సహవర్తతే‘ అని సెలవిచ్చారు.

అగ్నికి ప్రకాశగుణం ఉన్నది. ఉష్ఠగుణమూ ఉన్నది. ఉష్ణం ఎక్కువైతే ప్రకాశం అనుభవించలేము. ఉష్ణరహిత ప్రకాశమునే అనుభవించగలం. మిడుగురు పురుగు లది ఉష్ణంలేని ప్రకాశం. వానిలో ప్రకాశాంశ ఎక్కువ. ఉష్ణాంశ తక్కువ.

అంబికా స్వరూపం అత్యంత శీతలమూ అత్యంత ప్రకాశమూ. మబ్బులు గమ్మిన ఆకాశంలో మెరెసె మెరుపు తీగెఆమె ఆకృతి. నెవ్వరి ధాన్యానికి మొనలు బహుసూక్ష్మాలు. అంబిక, ‘నీవార శూకవత్త్వన్వీ‘. మూలాధారంనుండి సహస్రారంవరకూ ఆమె సన్నగా సూక్ష్మాతి సూక్ష్మంగా తామరతూటిలోని తంతువువలె వ్యాపించి ఉన్నదని మంత్ర శాస్త్రం చెపుతూంది. దేవతల అహంభావం పోగొట్టడానికి పరమాత్మ జ్యోతిర్మయంగా భూ సభఃపర్యంతం నిలిచినపుడు ఆయనలో అంతర్లీనయై నిలిచినది ఈమెయే.

వేదశీర్షమయిన కేనోపనిషత్తును ఆధారంగా ఉంచుకొని సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ విధంగా వ్రాశారు.

శ్రుతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ,
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయో ర్లాక్షాలక్ష్మీ రరుణహరి చూడామణి రుచిః

మనవారికి వేదాలు ప్రధానం. ఒకకొండ వేదగిరీ, ఇంకొక కొండ వేదాచలమూ. దానినే తిరుక్కళికుండ్రము, అని ఇప్పుడు అంటున్నారు. వేదారణ్యం అని ఒక క్షేత్రం ఉన్నది. తమిళంలో వత్తు అంటే వేదం. తిరువత్తూరు అనే పదంలో వత్తు అని వేదప్రసక్తి ఉన్నది. కొన్ని క్షేత్రాలలోని అర్చామూర్తులకు ఋగ్వేదేశ్వరుడూ సామవేదేశ్వరుడూ అనే పేరులు గూడా ఉన్నవి. వేదాలు క్షేత్రరూపంగానూ మహాలింగస్వరూపంగానూ ఉన్నవి అని అనడానికి ఇవి నిదర్శనం. కేనోపనిషత్తు పరమాత్మయే అనుగ్రహించే సమయాన ఉమగా ఆవిర్భవించాడని తెలుపుతూంది.

పరబ్రహ్మను గూర్చి ఆరంభించేప్పుడు ఓం అని ఆరంభించటం వాడుక. ఆకార ఉకార మకారాలు చేరి ఓంకార మవుతూంది. అనుగ్రహకాలంలో ఉమాదేవిగా, ఉకార మకార అకారాలుగా మారివస్తాడని చెపుతారు. ‘ఉమాం ఓం ఉత్యువేతి‘ అని ఆమె ప్రణవస్వరూపిణియై కూడా ఉన్నది. పతంజలి తమ యోగసూత్రములలో మూల పరస్వరూపానికి ఓంకారమే పేరు అని చెప్పేరు. వేదాంతాలలో కూడా ఈ సత్యమే చెప్పబడింది.

‘ శ్రుతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమా ప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ ‘

‘శ్రుతీనాం మూర్థానః‘ అనగా వేదవేషాలు, శ్రుతీనాం మూర్ధానః అన్న పదాలను చూచిన వెంటనే ఆచార్యుల వారు కేనోపనిషత్తును మనస్సులో ఉంచుకునే ఈ శ్లోకం వ్రాశారని ఇట్టే మనస్సుకు తట్టుతుంది.

‘వేదశీర్షాలయిన ఉపనిషత్తులే ఈ చరణాలను శిరోభూషలుగా గ్రహిస్తున్నవి. అట్టి నీ పావనమైనపదపంకజాలను నా తలమీద పెట్టి నన్ను పవిత్రుని చేయుము’. వేరొకచోట ”స్నపయ కృపయా మా మపి శివే” అని ఆచార్యులవారు అన్నారు. ఇక్కడ ”మ మాప్యేతౌ మాతః” అని అన్నారు. ఇవి అన్నీ మనబోటి వారిని వుద్దేశించి ప్రార్థన ఎట్లా చేయాలో బోధించటానికే ఆచార్యులవారు వ్రాశారని మనము గ్రహించాలి.

”దేవతల అహంభావాన్ని పోగొట్టావు. అలాగే నాదురితాలన్నీ తొలగ దోసి అరిషద్వర్గాలను హతమార్చి అజ్ఞానాన్ని ఆమూలంగా నశింప చేసి చిత్తశుద్ధిని నీచరణ స్పర్శతో అనుగ్రహించు. శివుని జటా జూటంలో పుట్టిన గంగ నీకు పాద్యం. మహావిష్ణువు యొక్క కౌస్తుభం నీపాదాల పారాణి ఎరుపుతో మరింత ఎఱ్ఱదనం పొందుతున్నది. మహోత్కృష్టాలైన అట్టి నీపాదాలను నీవుగనుక దయదలిస్తే తలదాల్చటానికి నేను సిద్ధంగా వున్నాను”. అని ఆచార్యులవారు సౌందర్యలహరిలో అమ్మవారితో మొరలిడుతున్నారు.

నేడు శుక్రవారం, దేవీ ప్రధానమైన దినం. కేనోపనిషత్తులో వర్ణింపబడిన జ్ఞానస్వరూపిణిని ఉమాదేవిని ధ్యానించి జన్మసుఫలం చేసుకుందాం.
 

Related Posts