Highlights
- ఇంటర్ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న విద్యార్థి
- కాపాడేందుకు తోటి స్నేహితుల యత్నం
- నిందితుల్లో ఒకర్ని పట్టుకున్న హోంగార్డు
- నలుగురు నిందితులది మూసాపేటే
- విచారణలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల వేళ విద్యార్థులు వేటకొడవళ్లతో సైర్యం విహారం చేశారు. కొందరు యువకులు దారుణమారణకాండను సృష్టించారు. సోమవారం ఈ సంఘటన హైదరాబాద్ నగర నడిరోడ్డుపైనే జరిగింది. కొందరు యువకులు ఓ ఇంటర్ విద్యార్థిని కత్తులతో దారుణంగా నరికి చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం, కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేటలో ఉన్న జనతానగర్‌లో నివసించే రాజుకు నలుగురు సంతానం. వారిలో ఆఖరి వాడైన సుధీర్ స్థానికంగా ఉండే ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం పరీక్ష రాసేందుకు సహ విద్యార్థులు మేఘనాథ్, సాయిలతో కలిసి పరీక్షా కేంద్రానికి బైక్‌పై బయలుదేరారు. జేఎస్‌పీ హోండా షోరూం వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన నలుగురు దుండగులు సుధీర్‌ను అడ్డగించారు. అతనిపై విచక్షణారహితంగా వేట కొడవళ్లతో దాడి చేశారు. తప్పించుకుని పారిపోతున్న అతన్ని వారు మరీ వెంటాడి నరికి చంపారు. తమ మిత్రుడిని కాపాడేందుకు సాయి, మేఘనాథ్ ప్రయత్నించగా దుండగులు వారిపై దాడికి యత్నించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. హత్య చేసి పారిపోతున్న నిందితుల్లో ఒకరిని ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు పరమేష్ వెంటపడి పట్టుకున్నారు. దొరికిన యువకుడిని మహేష్‌గా గుర్తించారు. ఇతనితో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా మూసాపేటవాసులేనని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.