YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మత్స్యపరిశ్రమ అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్ : కేంద్ర మంత్రి

మత్స్యపరిశ్రమ  అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్ : కేంద్ర మంత్రి

దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర మత్స్య పరిశ్రమ, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మత్స్య పరిశ్రమలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని అన్నారు. శుక్రవారం భోగాపురం మండలంలో పర్యటించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. ఇక్కడి రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం రూ.47,000 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎగుమతులను లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మత్స్య ఉత్పత్తుల్లో రసాయనాలు వినియోగించడం తగ్గించాలని రైతులకు కేంద్ర మంత్రి సూచించారు. ఇక నుంచి రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే సర్టిఫికేషన్ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు సగటు రొయ్యల ఉత్పత్తి మూడు టన్నులుగా ఉందన్నారు. దీనిని తొమ్మిది టన్నులుగా పెంచాల్సి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ
శాఖ నుంచి విడదీసి పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెంట ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్యశాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ ఉన్నారు.

Related Posts