YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

రాజధాని పైన ప్రభుత్వ కీలక నిర్ణయం అదేనా!! బొత్సా వ్యాఖ్యల వెనుక అసలు కధ: టార్గెట్ చంద్రబాబు..!!

రాజధాని పైన ప్రభుత్వ కీలక నిర్ణయం అదేనా!! బొత్సా వ్యాఖ్యల వెనుక అసలు కధ: టార్గెట్ చంద్రబాబు..!!

రాజధాని అమరావతి పైన ప్రభుత్వ ఆలోచన పైన స్పష్టత వస్తోంది. ఇప్పుడున్న ప్రాంతమే రాజధానిగా కొనసాగుతోంది. ఈ విషయం మీద నేరుగా కాకున్నా..ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. దీనిలో భాగంగానే ఇప్పటికే గత ప్రభుత్వ కమిట్ మెంట్ ప్రకారం రైతులకు కౌలు సైతం చెల్లించింది. కొద్ది రోజులుగా రాజధాని మీద జరుగుతున్న రగడకు తాత్కాలికంగా తెర పడింది. అయితే, సడన్ గా మంత్రి బొత్సా తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. అందులో ఈ సారి బొత్సా రాజధాని అంశం మీద బొత్సా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసారు. ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. రాజధానికి ఒక అడ్రస్ అంటూ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఈ అంశాలు బయట పెట్టటం వెనుక స్పష్టమైన వ్యూహంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులోనూ చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం అడుగులు వేస్తోందనేది స్పష్టమవుతోంది.

మంత్రి బొత్సా ఈ సారి రాజధాని ముంపు..ఖర్చు గురించి మాట్లాడ లేదు. కొత్తగా ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ ఇవ్వలేదని తొలి సారి బయట పెట్టారు. రాజధానికి ఒక అడ్రస్ అంటూ లేకుండా చేశారని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకు గెజిట్ ఇవ్వలేదని ..ఇచ్చారేమో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. దీని ద్వారా ఇతర నిర్మాణాల మాదిరే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని చెప్పుకొచ్చారు. దీని ద్వారా చంద్రబాబు అమరావతిని సైతం తాత్కాలిక రాజధానిగా చెప్పదలచుకున్నారా అనే చర్చ మొదలైంది. అయితే..అధికారులు నుండి అందుతున్న సమచారం మేరకు రాజధాని తరలింపు ఆలోచన ప్రభుత్వ పెద్దలకు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, అమరావతి అనే పేరుతో కాకుండా కొత్త పేరు రాజధానికి ప్రతిపాదించినట్లు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికార వర్గాల సమాచారం. దీని కోసం రాజధాని ప్రాంతంలో గత నిర్మాణాల మీద విచారణ చేస్తూనే..అధికార వికేంద్రీకరణ పేరుతో ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమరావతి అనే పేరు బ్రాండ్ గా టీడీపీ ప్రచారం చేస్తున్న సమయంలో..ఆ పేరు కొనసాగించటానికి ప్రభుత్వం సముఖంగా లేదని తెలుస్తోంది. అమరావతి పేరుతోనే ప్రధాని రాజధానికి శంకుస్థాపన చేసారు. అయితే, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలను ప్రభుత్వం వివరిస్తూ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

అమరావతికి తానే రూపకల్పన చేసానని...భూ సమీకరణ ద్వారా వేలాది ఎకరాలు ఉచితంగా సమకూర్చుకున్నామని టీడీపీ అధినేతతో సహా ఆ పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పటికీ అమరావతి పైన తాము చేసిన నిర్ణయాల గురించే టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో..తాము రాజధాని వారు సమీకరించిన ప్రాంతం యధావిధిగా ఉంచుతూ జాతీయ రహదారి పైన కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో నిర్మాణ ఖర్చు గురించి ప్రజల్లో చర్చ కోసమే ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రస్తావించిందని చెబుతున్నారు. అమరావతి పేరు సైతం మార్చి మరో పేరును రాజధానికి ఖరారు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అమరావతి పేరును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పత్రికాధిపతి సూచన మేరకు చంద్రబాబు ఖరారు చేసారు. దీంతో..ఇప్పుడు ఆ పేరును కొనసాగించినంత కాలం చంద్రబాబు ముద్ర తాము ఎంత చేసినా..పరోక్షంగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ ముద్రను తొలిగించి తాము రాజధాని నిర్మాణం ప్రారంభించాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు తాత్కాలికంగా అమరావతి రాజధాని చేసారనే వాదన తెర మీదకు తెచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అదే విధంగా గెజిట్ జారీ చేయలేదని చెప్పటం ద్వారా.. తాము చేయబోతున్న నిర్ణయానికి రూట్ క్లియర్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మంత్రి బొత్సా వ్యాఖ్యలలో భాగంగా రాజధాని మీద కీలక నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే రాజధాని మార్పు ఉండదని ప్రభుత్వంలోని మంత్రులే చెబుతున్నారు. రాజధాని తరలిస్తే ప్రతిపక్షంతో పాటుగా కేంద్రం అదే విధంగా.. సొంత పార్టీలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో..ప్రభుత్వం కొత్త ఆలోచనల ప్రకారం మంగళగిరి..తాడేపల్లి ప్రాంతాలు ప్రస్తుతం మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వీటిని రెండింటిని కలిపి మున్పిపల్ కార్పోరేషన్ గా చేయటం ద్వారా రాజధాని పరిధిలోని ఈ ప్రాంతం సైతం డెవలప్ చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. రాజధాని పేరు సైతం అమరావతి ని మార్చి మరో పేరు ఖరారు చేస్తూ గెజిట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలను సడన్ గా అమలు చేస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని..ప్రాంతాల వారీగా అధికార వికేంద్రీకరణ ప్రకటించి.. అప్పుడు రాజధాని పేరు మీద నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా స్పష్టమైన సమాచారం. అందులో భాగంగానే మందు నుండే ప్రభుత్వం ప్రజల్లోకి తమ ఆలోచనలను తీసుకెళ్లే ప్రయత్నాలనున మొదలు పెట్టింది. వైసీపీ నేతల అంచనా ప్రకారం రాజధాని తరలించకుండా.. పేరు మాత్రం మార్చితే తమకు ఇబ్బందులు ఉండవని..రాజకీయంగానూ కలిసి వస్తుందని చెబుతున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది.
 

Related Posts