చిన్న వ్యాపారులకు అండగా ప్రభుత్వాలు
అదిలాబాద్, రోజూ వారి ఆదాయంపై ఆధారపడే చిరు వ్యాపారులకు చింతలు ఇక నుంచి తీరనున్నాయి. ప్రైవేటు ఫైనాన్షియర్ల తిప్పలు తప్పనున్నాయి. పెట్టుబడి కోసం ఎవరిమీదా ఆధారపడకుండా సొంతంగా సామగ్రిని సమకూర్చుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తున్నాయి. దీన్ దయాల్ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ పథకం ద్వారా బ్యాంక్ లింకేజీతో రూ.50 వేలు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో వారికి రుణాలు అందజేయనున్నారు. రుణాలు అందించడంపై చిరు వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.ఆదిలాబాద్ పట్టణంలో ఏ ఫుట్‌పాత్ చూసినా, ఏ కూడలిని గుర్తుకు తెచ్చుకున్నా వీధి వ్యాపారులతోనే నిండి ఉంటుంది. పట్టణానికి వలస వచ్చే వారికి, కాస్తో కూస్తో సంపాదించడానికి వీధి వ్యాపారమే ఆధారం. చేయడానికి తగిన పని దొరకక, చదువు, నైపుణ్యం లేని వారు తగినంతలో ఉపాధి పొందడానికి ఈ రంగమే ప్రధాన వనరు.పూలు, పండ్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు, సరుకులు, నిత్యావసరాలను అమ్ముతూ వీరు జీవనం సాగిస్తుంటారు. పార్కింగ్ స్థలాలు, రోడ్డు మార్గాల్లో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ చిన్నపాటి గుడారం, లేదంటే వీధుల్లో తిరుగుతూ, తోపుడు బండ్లమీద అమ్మకాలు చేస్తుంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అమ్మకాలు చేస్తుంటారు. వీరిలో ప్రధానంగా మహిళలే ఎక్కువగా ఉంటారు. వీరికొచ్చే రోజు వారి ఆదాయం సరాసరిగా రూ.150 నుంచి రూ.20 ఉంటుంది. వీరంతా రోజు వారి పెట్టుబడి కోసం ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. అమ్మకాలు లేక పోయినా, గిట్టుబాటు కాకపోయినా ఆర్థికంగా చితికిపోవాల్సిందే. ఇక వడ్డీలు, కమీషన్ కటింగ్‌లతో కుదేలవుతున్నారు. వర్షం వచ్చో.. ఆనారోగ్యం బారినపడితేనో ఆ రోజు వాయిదాలు పెండింగ్ పడడంతో పైనాన్షియర్ల వేధింపులు మామూలే. వీటన్నింటినీ తట్టుకుంటూ పొట్టపోసుకుంటున్న వారికి దీన్ దయాల్ జాతీయ పట్టణ జీవన ఉపాధి మిషన్, స్వయం ఉపాధి ద్వారా రుణాలను అధికారులు అందించనున్నారు.చిరు వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చిరు వ్యాపారుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతను అప్పగించింది. పట్టణంలో 1,348 మంది రోడ్లపై వ్యాపారాలు చేసుకుంటున్నట్లు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గుర్తించింది. ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. స్వయం ఉపాధి పథకం కింద 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను ఇప్పించనున్నారు. దీన్ దయాల్ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ పథకం ద్వారా ఒక్కొక్కరికీ రూ.50 వేల వరకు రుణాలను అందించడానికి వంద మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. త్వరలో లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందజేయనున్నారు. రూ.100కు ఏడాదికి రూ.14 వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. 7 శాతం లబ్ధిదారుని వాటా, ప్రభుత్వం 7 శాతం భరిస్తుంది. కాగా.. ఈ రుణాలు విడతల వారీగా అందించనుండగా.. చిరువ్యాపారుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.