ప్రారంభానికి నోచుకోని పశువుల ఆస్పత్రి
నల్లగొండ, పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పాడిగేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలను నిత్యం వైద్యసేవల కోసం ఆస్పత్రికి తీసుకువస్తుంటారు. ఇంతకాలం సరైన సౌకర్యాలు లేకపోవడంతో సేవలు సరిగా అందించలేక సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో బహుళార్థక పశు వైద్యశాల నిర్మాణానికి 2017లో ఆర్‌ఐడీఎఫ్ పథకం కింద రూ. ఐదు కోట్ల నాబార్డ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా తెల్ల పశువులు 1.20 లక్షలు, నల్ల పశువులు 4.10 లక్షలు, మేకలు, గొర్రెలు 12 లక్షలు, కోళ్లు మూడు కోట్లు, పెంపుడు కుక్కలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తే వాటన్నింటికి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అం దే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాణం పూర్తయినా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పశు వైద్యశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మూడంతస్తుల్లో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించడంతోపాటు, ఆధునిక పరీక్షల కోసం ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ విభా గాలను నిర్మించారు. చిన్న, పెద్ద జంతువులకు అన్ని రకాల వైద్యసేవలను అందించడంతోపాటు ఇన్‌పేషెంట్ సేవలకు అవసరమైన సిబ్బందిని సైతం నియమించారు. ఆపరేషన్ థియేటర్‌కు పశువులను తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులను మంజూరు చేశారు.