మొదటిసారి గృహాలు కొంటున్నవారికి అదనపు పన్ను ప్రోత్సాహకాన్ని వచ్చే ఆర్థిక బడ్జెట్‌లో రెండింతలు చేసి లక్ష రూపాయులుగా నిర్ణయించాలని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జె.ఎల్.ఎల్. ఇండియా సూచించింది. మందకొడిగా ఉన్న గృహ నిర్మాణ రంగంలో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఇలాంటి ప్రోత్సాహం అవసరమని పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల (ఆర్.ఇ.ఐ.టి.లు)ను స్వావలంబన కలిగినవిగా చేసేందుకు వాటిని స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయించాలని రాష్ట్రాలను కోరాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
మొదటిసారి గృహ నిర్మాణాలు చేపడుతున్నవారికి ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టంలోని 80ఇ.ఇ. సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకు మాత్రమే అదనపు పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. మొదటిసారి గృహాల కొనుగోలుకు వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు దాన్ని లక్ష రూపాయులకు పెంచాలని ఆ సంస్థ కోరింది. ఆదాయ పన్ను చట్టంలోని 24వ సెక్షన్ కింద రూ. 2 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు పరిమితి కాకుండా, ఈ ప్రోత్సాహకాన్ని కల్పించాలని జె.ఎల్.ఎల్. ఇండియా సి.ఇ.ఓ. రమేశ్ నాయర్ అన్నారు. డివిడెండ్ పంపిణీ పన్ను, యూనిట్ల బదలీపై దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ పన్ను వంటి అంశాలను పరిష్కరించారని, కానీ, ఆర్.ఇ.ఐ.టి.లు రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ స్టాంప్ డ్యూటీ చార్జీలు చెల్లించవలసి వస్తోందని ఆయన అన్నారు. ఆర్.ఇ.ఐ.టి.ల పోటీ సావుర్థ్యాన్ని పెంచేందుకు, కనీసం మొదట్లో కొద్ది ఏళ్ళ వరకు అయినా స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయించవలసిందిగా కేంద్రం రాష్ట్రాలకు నచ్చజెప్పాలని ఆయన కోరారు. స్థిరాస్తుల రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని అన్నారు.