కేశవుడు...అలకకు కారణం ఏమిటీ
అనంతపురం, సెప్టెంబర్ 11,
రాక రాక వచ్చిన అవకాశం ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. అత్యంత కీలకమైన పోస్టు ఆయనను వరించింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. పక్కన పెట్టి మరీ టీడీపీ చంద్రబాబు.. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి విజయం సాధించిన పయ్యావుల కేశవ్‌కు జగన్ ప్రభుత్వంలోని కీలకమైన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవి కోసం ఎంతో మంది కుస్తీపట్టారు. కానీ, చంద్రబాబు మాత్రం పయ్యావులకే ఈ పదవి దక్కేలా చేశారు. మరి ఇంత కీలకమైన పదవిని చేపట్టిన పయ్యావుల ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ప్రజాపద్దుల కమిటీ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి. ప్రభుత్వం చేసే ఖర్చులు, వివిధ ప్రాజెక్టుల వివరాలు, బడ్జెట్ కేటాయింపులపై నిశితంగా పరిశీలన చేసి తప్పు ఒప్పులను ఎంచే అత్యంత కీలకమైన పదవి ఇది. దీనికి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సంబంధం లేకుండా కేబినెట్ హోదా ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు అండ్ కో.. అందరూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రివర్స్ టెండరింగుల ద్వారా ఆయన సాధించేది శూన్యమని చెబుతున్నారు. అదే సమయంలో వివిధ పథకాలకు ఆయన చేస్తున్న ఖర్చులోనూ లొసుగులు వెతుకుతున్నారు.మరి ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో తనకు ఇచ్చిన పదవిని ఆధారం చేసుకుని మరింతగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ, పయ్యావుల మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉండిపోయారు. వాస్తవానికి ఛైర్మన్‌ను అయితే ప్రకటించారు కానీ, కీలకమైన సభ్యులను ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో ఆయన ఏమీ చేయలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో పయ్యావులే చొరవ తీసుకుని ప్రజాపద్దుల కమిటీని ఏర్పాటు చేసేలా ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.అవసరమైతే.. గవర్నర్‌ను కలిసి తన డిమాండ్‌ను ఆయన దృష్టికి తీసుకు వెళ్లి పని సాధించాలి. కానీ, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అదే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీని అంకెలతో సహ అసెంబ్లీ లోపల, బయటా ఓ ఆటాడుకునే వారు. ఇక స్థానికంగా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి రావడంతో అక్కడ టీడీపీ కేడర్ పయ్యావులకు షాకు ఇచ్చి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. కనీసం వాళ్లను ఆపే ప్రయత్నాలు కూడా పయ్యావుల చేస్తున్నట్టు లేదు. దీంతో పయ్యవుల విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.